Asianet News TeluguAsianet News Telugu

థామస్ కప్ 2022లో సెమీ ఫైనల్ చేరిన భారత బ్యాడ్మింటన్ జట్టు... చారిత్రక తొలి మెడల్‌ ఖాయం...

ఫైవ్ టైమ్ ఛాంపియన్‌ మలేషియాని 3-2 తేడాతో ఓడించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు... మొట్టమొదటి పతకం ఖాయం చేసుకున్న టీమిండియా...

Thomas Cup 2022: Indian Men's Badminton team reached semi-finals, confirms first ever medal
Author
India, First Published May 12, 2022, 11:10 PM IST

థామస్ కప్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పటిదాకా థామస్ కప్ టోర్నీలో మెడల్స్ సాధించలేకపోయిన భారత్‌కి మొట్టమొదటి పతకం ఖాయమైపోయింది. మలేషియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు 3-2 తేడాతో విజయాన్ని అందుకుని... సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది...

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్‌తో పాటు డబుల్స్ జోడీ సాయి సాత్విక్, చిరాగ్ తమ మ్యాచుల్లో విజయాలను అందుకున్నారు. ఐదు సార్లు టైటిల్స్ గెలిచిన మలేషియాను అద్భుత ఆటతీరుతో ఓడించింది భారత్...

1979 నుంచి జరుగుతున్న థామస్ కప్ టోర్నీలో ఇప్పటివరకూ భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు పతకాలు గెలవలేకపోయారు. ఉబర్ కప్‌ టోర్నీలో మాత్రం భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్లు 2014, 2016 సీజన్లలో కాంస్య పతకాలు సాధించారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన కిడాంబి శ్రీకాంత్ సారథ్యంలో ప్రారంభంలో 0-1 తేడాతో వెనకబడినా ఆ తర్వాత అన్యూహ్యంగా పుంజుకుని 3-2 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లారు...

ఉబర్ కప్ 2022 టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లో పీవీ సింధు సారథ్యంలోని భారత మహిళా బ్యాడ్మింటన్ జట్టు, థాయిలాండ్ చేతుల్లో 0-3 తేడాతో చిత్తుగా ఓడింది. ఈ పరాజయం తర్వాత కొద్ది గంటల్లోనే భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధం కావడం విశేషం...

వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్, మలేషియా ప్లేయర్ లీ జీ జియాతో జరిగిన మ్యాచ్‌లో  21-23, 21-9 తేడాతో పోరాడి ఓడాడు. అయితే డబుల్స్‌లో భారత స్టార్లు సాత్విక్ సాయిరాజ్ రింకీ రెడ్డి- చిరాగ్ శెట్టి, మలేషియా జోడీ ఫీ జీ గో- ఇజుద్దీన్ నూర్‌లను 21-19, 21-15 తేడాతో ఓడించి... స్కోర్లను 1-1 తేడాతో సమం చేశారు...

కిడాంబి శ్రీకాంత్, మలేషియా ప్లేయర్ యంగ్ టీ నీజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-11, 21-17 తేడాతో సునాయాస విజయం సాధించాడు. శ్రీకాంత్ కేవలం 41 నిమిషాల్లోనే మ్యాచ్‌ని ముగించాడు. అయితే ఆ తర్వాత కృష్ణ ప్రసాద్, పంజాల విష్ణువర్ణన్ జోడీని 21-19, 21-17 తేడాతో ఓడించిన మలేషియా జోడీ అర్న్ చియా- టియో యి... స్కోర్లను 2-2 తేడాతో సమం చేశారు...

దీంతో ఆఖరిగా బరిలో దిగిన ప్రణయ్‌ విజయంపైనే భారత్ ఆశలన్నీ పెట్టుకుంది. లియాంగ్ జె హువాయ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-8 తేడాతో అద్భుత విజయం సాధించిన ప్రణయ్, 30 నిమిషాల్లోనే మ్యాచ్‌ని ముగించి... భారత జట్టు సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసేశాడు... వరల్డ్ నెం. 23 ప్లేయర్ ప్రణయ్ జోరు ముందు నిలవలేకపోయిన లియాంగ్, కేవలం 30 నిమిషాల్లోనే చేతులు ఎత్తేశాడు...

ప్రణయ్ మ్యాచ్‌ను వీక్షించిన భారత బ్యాడ్మింటన్ జట్టు ప్లేయర్, విన్నింగ్ షాట్ తర్వాత పరుగెత్తుకుంటూ వచ్చి, సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. డెన్మార్, కొరియా మధ్య జరిగే రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టును సెమీస్‌లో ఎదుర్కోబోనుంది భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు.

Follow Us:
Download App:
  • android
  • ios