టీం ఇండియా క్రికెటర్ హర్భజన్ సింగ్.. సినిమా పోస్టర్ లో చూసి గీతా బస్రాను ప్రేమించానని తెలిపారు. 2015 అక్బోర్ లో హర్భజన్ సింగ్ కి బాలీవుడ్ హీరోయిన్ గీతా బస్రాతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి ఇప్పుడు రెండేళ్ల పాపకూడా ఉంది.  అయితే.. గీతను తాను మొదట ఎక్కడ చూశాడో, ఎలా ప్రేమించాడో ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఓ టీవీ షోకి హాజరైన హార్బజన్.. తన లవ్ స్టోరీని వివరించారు. ‘ ఫస్ట్ టైమ్ గీతను ఓ మూవీ పోస్టర్ లో చూశాను. చూడగానే బాగా నచ్చేసింది. వెంటనే తన ఫోటో యువరాజ్ సింగ్ కి చూపించి .. ఎవరో తెలుసా అని అడిగాను. అతను తెలీదని చెప్పాడు. వివరాలు కనుక్కోమని యూవీకి చెప్పాను.’

‘ఆ తర్వాత గీతకి నాకు సువేద్ లోహియా అనే కామన్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది. అతని ద్వారా గీతను తొలిసారి కలిశాను.  ఫోన్ నెంబర్ కూడా తెలుసుకున్నాను. అదే సమయంలో మేం ప్రపంచకప్‌ గెలిచాం. మ్యాచ్‌ ముగిశాక తిరిగి ముంబయి వచ్చేశాను. ఆ తర్వాత గీతకు మెసేజ్‌ చేసి కాఫీ షాప్‌లో కలుద్దామని చెప్పాను. కానీ గీత సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత ఐపీఎల్‌ మొదలైంది. ‘మాకు టికెట్స్‌ దొరుకుతాయా?’ అని గీత నన్ను అడిగింది. కానీ టికెట్‌ తన కోసం కాదని తన డ్రైవర్‌ కోసమని చెప్పింది. తను అడిగింది కదా అని టికెట్స్‌ ఇప్పించాను. నేను సాయం చేశాను కాబట్టి తను కాఫీకి రావడానికి ఒప్పుకొంది. అలా కొన్ని రోజుల పాటు తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లం. ఓసారి పెళ్లి గురించి అడిగితే.. ‘నాకు ముందు కెరీర్‌ ముఖ్యం’ అంది. నాకు కూడా కెరీరే ముఖ్యం అని చెప్పాను. అలా తొమ్మిది నెలలు గడిచాక పెళ్లికి ఒప్పుకొంది’  అంటూ తన లవ్ స్టోరీని బజ్జీ వివరించారు.