ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023 విజేతగా టీమిండియా... ఫైనల్‌లో ఇరాన్‌పై ఘన విజయం..

ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై 42-32 తేడాతో ఘన విజయం అందుకున్న భారత కబడ్డీ జట్టు... చివరి అర నిమిషంలో అదరగొట్టిన టీమిండియా.. 

team India Wins Asia Kabaddi Championship title beating Iran in final CRA

భారత కబడ్డీ జట్టు, ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023 టైటిల్‌ని కైవసం చేసుకుంది. కొరియాలోని బూసన్‌‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై 42-32 తేడాతో ఘన విజయం అందుకుంది భారత కబడ్డీ జట్టు..

టీమిండియా కబడ్డీ కెప్టెన్ పవన్ సెహ్రావత్ 42 పాయింట్లలో 16 పాయింట్లు తెచ్చి, టీమ్‌ని ముందుండి నడిపించాడు. తొలి సగం ముగిసే సమయానికి 19-9 పాయింట్లతో 10 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది భారత జట్టు. అయితే రెండో సగంలో ఇరాన్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చి, 29-32 తేడాతో ఆధిక్యాన్ని   తగ్గించగలిగింది.. 

ఆట మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా సూపర్ ట్యాకిల్ చేసిన టీమిండియా, ఆలౌట్ చేసి 5 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత అర్జున్ దేశ్‌మన్ రైడ్‌లో 2 పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో 10 పాయింట్ల తేడాతో టీమిండియాకి విజయం దక్కింది. 

ఇండియా, ఇరాన్ రెండు జట్లు కూడా వరుస విజయాలతో ఫైనల్‌కి వచ్చాయి. అంతకుముందు జపాన్‌తో మ్యాచ్‌లో 62-17 తేడాతో ఘన విజయం అందుకున్న భారత కబడ్డీ జట్టు, కొరియాపై 76- 13 తేడాతో గెలిచింది. చైనీస్ తైపాయ్‌తో మ్యాచ్‌లో 53-19 తేడాతో విజయాన్ని అందుకున్న భారత కబడ్డీ జట్టుకి ఇది 8వ ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ టైటిల్..

ఇప్పటిదాకా 9 సార్లు ఈ టోర్నీని నిర్వహించగా 2003లో ఇరాన్ ఈ టైటిల్ గెలిచింది. ఆ సీజన్‌లో భారత కబడ్డీ జట్టు, ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనలేదు. మిగిలిన 8 సార్లు కూడా భారత కబడ్డీ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది...

2005, 2017 సీజన్లలో జరిగిన ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరి, టీమిండియా చేతుల్లో ఓడిన పాకిస్తాన్.. ఈసారి వీసా సమస్యల కారణంగా పోటీల్లో పాల్గొనలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios