ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆటగాడతడు. విద్వంసకర బ్యాట్ మెన్ గా పేరుతెచ్చుకున్న అతన్ని దక్కించుకునేందుకు ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫ్రాంచైజీలు ఒకప్పుడు పోటీ పడ్డాయి. చివరకు ఐపిఎల్ వేలంపాట చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. అతడే టీంఇండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్. 

అయితే అదంతా గతం...ప్రస్తుతం యువరాజ్ ఫామ్ కోల్పోయి, భారత జట్టులో స్థానం కోల్పోయి తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. దీంతో ఐపిఎల్ 2019 కోసం తన కనీస ధరను అమాంతం కోటి రూపాయలకు తగ్గించుకున్నాడు. అయినా ఇటీవల జైపూర్ వేదికగా ఐపిఎల్ 2019 కోసం జరిగిన వేలంపాటలో యువరాజ్ ను దక్కించుకునేందకు ఏ ప్రాంఛైజీ ముందుకు రాలేదు. చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ  కనీస ధరకే యువరాజ్ ను కైవసం చేసుకుంది. 

ఇలా ఒకప్పుడు యువరాజ్ ని దక్కించుకోడానికి పోటీ పడ్డ అవే ఫ్రాంచైజీలు ఇప్పుడు తిరస్కరించారు. దీంతో యువరాజ్ పరిస్థితి పూలు అమ్ముకున్న చోటే కట్టెలు అమ్మాల్సి వచ్చినట్లుగా తయారయ్యింది. 

తాజాగా ఈ వేలంపాట అంశంపై యువరాజ్ స్పందించాడు. వచ్చే ఏడాది జరిగే ఐపిఉల్ కోసం ఎదురుచూస్తున్నానని...ఇందులో తానేంటో నిరూపించుకోవాలని కసితో ఉన్నానని వెల్లడించాడు. తాను క్రికెట్ కోసం ఆడటం లేదని...తనకోసం తాను ఆడుతున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ఆడుతున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత తన రిటైర్మంట్ పై ఆలోచిస్తానని యువరాజ్ స్పష్టం చేశాడు.