సరదాగా కోసం ఓ టీవి షోలో పాల్గొని... వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా టీంఇండియా ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా తన కెరీర్ లోనే గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యాఖ్యల కారణంగా క్రికెట్ నుండి వేటుకు గురవడంతో పాటు... మహిళలు, అభిమానుల నుండి తీవ్ర విమర్శలపాలవుతున్నాడు. దీంతో మానసికంగా దెబ్బతిన్న పాండ్యాకు తోటి క్రికెటర్ శిఖర్ ధావన్ బాసటగా నిలిచాడు. పాండ్యాకు మానసిన స్థైర్యాన్ని పెంచే విధంగా మాట్లాడుతూ...అతడి టీంఇండియా  జట్టులో ఎంత కీలక ఆటగాడో ధావన్ వివరించాడు. 

భారత జట్టులో ప్రస్తుతం ఆల్‌ రౌండర్‌‌గా హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ఆటగాడని ధావన్‌ పేర్కొన్నాడు. అతడు తన ధనా ధన్ బ్యాటింగ్ తో పాటు  అవసరమైనప్పుడు బౌలింగ్ లోను తన సత్తా చాటగల ఆటగాడని ప్రశంసించాడు. భారత జట్టుకు సమతూకంలో వుండటంలో హార్దిక్‌ ముఖ్య భూమిక పోషించాడని ధావన్ కొనియాడారు.

ఇటీవల ఓ జాతీయ టివి ఛానల్లో ప్రసారమయ్యే కాఫీ విత్ కరణ్ షో కార్యక్రమంలో టీంఇండియా యువ ఆటగాళ్ళు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ అడిగిన పలు ప్రశ్నలకు హార్థిక్ పాండ్యా మహిళలను కించపర్చేలా జవాబులిచ్చాడు. తన వ్యక్తిగత లైంగిక వ్యవహారాల గురించి తల్లిదండ్రులతో చర్చించినట్లు కూడా పాండ్యా తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు, ప్రజలు,మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదాస్పదమయ్యాయి.  

దీంతో హార్దిక్ తో పాటు రాహుల్ పై కూడా బిసిసిఐ రెండు వన్డేల నిషేదాన్ని విధించింది. పాండ్యా, రాహుల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పినా సంతృప్తి చెందని అధికారులు క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే వీరిపై చర్యలకు దిగింది. ఇలా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న సహచరుడికి ధావన్ అండగా నిలిచాడు.