బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా జరిగిన టెస్ట్ సీరిస్లో భారత ఆటగాళ్లు చరిత్ర సృష్టించిన విషయం  తెలిసిందే. ఆసిస్ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించిన భారత ఆటగాళ్లు చిరకాల ఆశయాన్ని నెరవేర్చారు. ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ మొదలైన 1947-48 తర్వాత ఇలా వారి స్వదేశంలోనే  ఆసిస్‌ను ఓడించడం కేవలం కోహ్లీ సేనకే సాధ్యమైంది.

నాలుగు టెస్టుల సీరిస్ లో మొదటి మూడు మ్యాచుల్లో రెండింటిని టీంఇండియా గెలవగా...ఒకటి ఆసిస్ గెలుపొందింది. దీంతో 2-1 ఆధిక్యంలో నిలిచిన భారత్... చివరి సిడ్నీ టెస్ట్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో భారత్ టెస్ట్ సీరిస్ ను కైవసం చేసుకుంది. 

ఇలా ఆసీస్‌ గడ్డపై  మొదటిసారి టెస్టు సిరీస్‌ గెలిచిన ఆనందంలో భారత ఆటగాళ్లు గ్రౌండ్ లోనే సంబరాలు చేసుకున్నారు.  మంచి జోష్‌లో వున్న ఆటగాళ్ళంతా కలిసి గ్రౌండ్‌లో డ్యాన్స్‌ చేస్తూ విజయాన్ని ఆస్వాదించారు.  అయితే ఈ సంబరాల్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సన్నివేశం అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. 

భారత ఆటగాళ్లంతా  కోహ్లీతో కలిసి గ్రౌండ్ లోను డ్యాన్స్ చేశారు. కానీ ఈ టెస్ట్ సీరిస్ సెంచరీల వీరుడు, మ్యాన్ ఆఫ్ ది సీరిస్ విజేత చతేశ్వర్ పుజారా మాత్రం వెనుక నిల్చుని కేవలం చప్పట్లతో సరిపెట్టడానికి ప్రయత్నించారు. కానీ జట్టు సభ్యులు ఆతడిని మధ్యలోకి లాగి డ్యాన్స్ చేసేలా చేశారు. అయినా అతడు తడబడుతూనే టీంసభ్యులతో పాదం కలిపాడు. 

ఆయితే ఈ సరదా డ్యాన్స్ గురించి స్పందించిన కోహ్లీ...ఇదంతా రిషబ్ పంత్ ప్లాన్ అని తెలిపాడు. అతడు తమ  దగ్గరకు వచ్చి ఇలా  డ్యాన్స్ చేద్దామంటూ చెప్పి అందరికి చెప్పాడు. దీంతో ఆటగాళ్లమంతా కలిసి గ్రౌండ్ లోనే డ్యాన్స్ కు చేశాం. అయితే ఎంతో సులభంగా, సరదాగా వున్న మూమెంట్స్ ని చేయడంలో పుజారా తడబడ్డాడని కోహ్లీ వెల్లడించాడు.    

టీంఇండియా ఆటగాళ్ల డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా తన అధికారిక ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. పుజారా బ్యాటింగ్‌ చేయగలడు...కానీ డ్యాన్స్‌ మాత్రం చేయలేడు అంటూ చమత్కరిస్తూ ఓ కామెంట్ ని  వీడియోకి జతచేసింది.

వీడియో