ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాన్ని దూరం పెట్టడం చాలా మంచిదని సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. కేవలం ఇరుదేశాల మధ్య రాజకీయ,వాణిజ్య సంబంధాల్లోనే కాదు అన్ని రకాల క్రీడల్లోను పాక్ తో భారత్ తెగదెంపులు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. టీంఇండియా క్రికెట్ జట్టు ప్రస్తుతం కేవలం ద్వైపాక్షిక సీరిసుల్లో మాత్రమే పాక్ జట్టుతో ఆడటంవలేదని...ఇకనుంచి ఐసిసి నిర్వహించే టోర్నీల్లో కూడా పాక్‌తో ఆడకూడదని హర్భజన్ సూచించారు. 

ముఖ్యంగా ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా జూన్ 16న పాక్‌తో జరిగే మ్యాచ్ ను బహిష్కరించాలని హర్భజన్ పిలుపునిచ్చారు. ఇలా అంతర్జాతీయ సమాజం దృష్టికి పాక్ దుశ్యర్యను తీసుకెళ్లాలన్నారు. ఈ ఒక్క మ్యాచ్ ను బహిష్కరించడం ద్వారా టీంఇండియా విజయావకాశాలేమీ దెబ్బతినవని అన్నారు. ఈ దిశగా బిసిసిఐ చర్యలు తీసుకోవాలని హర్బజన్ సూచించారు.  

 పుల్వామా దాడిలో సహచరులను కోల్పోయిన బాధలో వున్న భారత సైనికులకు ప్రతిఒక్కరు అండగా వుండాలని హర్భజన్ తెలిపారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు తగిన విధంగా సాయం చేయాలని సూచించారు. ఇలాంటి సమయంలో పాక్ తో క్రికెట్, హాకీ వంటి ఏ క్రీడలను కూడా ఆడాల్సిన అవసరం లేదని...క్రీడల కంటే దేశమే తమకు ముఖ్యమని హర్భజన్ పేర్కొన్నారు.