ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో భారత్ తరపున బరిలోకి దిగనున్న ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యింది. ముఖ్యంగా వరల్డ్ కప్ జట్టులో సీనియర్లతో పాటు అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్న యువ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు టీంఇండియా చీప్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు యువ ఆటగాళ్లను ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించే విషయం తమ పరిశీలనలో వుందంటూ ఆయన బయటపెట్టాడు.  

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు న్యూజిలాండ్ పర్యటనలో రాణించిన యువ క్రికెటర్లు ప్రంపంచ కప్ రేసులోకి దూసుకువచ్చారని ప్రసాద్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సీరిస్ లో చెలరేగి ఆడిన రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీ సాధించాడని గుర్తుచేశారు. అయితే అతడింకా వన్డే, టీ 20 లలో తన సత్తా చాటాల్సి వుందన్నారు. ఈసారి వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది...కాబట్టి రిషబ్ పంత్ ఆస్ట్రేలియా పర్యటనలో సాధించిన పరుగులు, ఆటతీరును పరిగణలోకి తీసుకుని అతడి పేరును పరిశీలిస్తున్నట్లు ఎమ్మెస్కే తెలిపారు. 

న్యూజిలాండ్ వన్డే సీరిస్‌లో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నట్లు ఎమ్మెస్కే తెలిపారు. ఈ పర్యటనలో నిలకడగా రాణిస్తూ కొన్ని పరుగులే సాధించినా తనదైన షాట్లతో అలరించాడని పేర్కొన్నాడు.అందువల్ల ఇండియా ఎ జట్టు తరపున అతని ఆటతీరును కూడా పరిశీలిస్తున్నామన్నారు. వరల్డ్ కప్ జట్టులో అతడు ఏ స్థానంలో అత్యుత్తమంగా ఆడగలడో పరిశీలిస్తున్నామని ఎమ్మెస్కే వెల్లడించారు. 

ఇక మరో సొగసరి బ్యాట్ మెన్ అంజిక్య రహానే పేరు కూడా తమ పరిశీలనలో వుందన్నారు. దేశవాళి క్రికెట్ రాణించడం ద్వారా రహానే పేరు అనూహ్యంగా వరల్డ్‌కప్ ఆటగాళ్ల జాబితాలో చేరిందన్నారు.  అతన్ని మూడో ఓపెనర్‌గా తీసుకోవాలని భావిస్తున్నామని ఎమ్మెస్కే వెల్లడించారు.