పుల్వామా దాడి నేపథ్యంలో క్రికెట్ వరల్డ్ కప్‌ లో భారత్-పాక్ మ్యాచ్ పై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. దేశ సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ సహకరిస్తున్నట్లు రుజువులతో సహా బయటపడింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ జట్టుతో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడకూడదంటూ టీంఇండియా మాజీలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కు తాజాగా భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా సమర్థించారు. 

భారత ప్రభుత్వం ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ ఆడవద్దని ఆదేశిస్తే తాము అలాగే చేస్తామని రవిశాస్త్రి అన్నారు. వారి నిర్ణయానికి బిసిసిఐతో పాటు భారత జట్టు  కట్టుబడి వుంటుందన్నారు. కేవలం పాక్ మ్యాచ్ నే కాదు...ప్రపంచ కప్ మొత్తాన్ని బహిష్కరించమన్నా భారత ఆటగాళ్లు, సిబ్బంది శిరసా వహిస్తుందని రవిశాస్త్రి స్పష్టం చేశారు.  

అయితే ప్రపంచ కప్ కు ఇంకా చాలా సమయం వుంది కాబట్టి ప్రభుత్వం,బిసిసిఐ ఇంత త్వరగా ఈ విషయంపై నిర్ణయం తీసుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వారికి బాగా తెలుసని రవిశాస్త్రి తెలిపారు. 

ఇదే ఉగ్రవాదం కారణంగా కొన్నేళ్లుగా భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సీరిస్ లు జరగడం లేదు. కేవలం ఐసిసి నిర్వహించే టోర్నమెంట్లు, ఆసియా కప్ వంటి వాటిలోని ఈ రెండు దేశాలు తలపడుతున్నాయి. తాజా పుల్వామా దాడితో అలా అరుదుగా జరిగే మ్యాచులపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.