గత రెండు నెలలుగా ఆస్ట్రేలియా పర్యటనలో తీరిక లేకుండా గడిపిన టీంఇండియా కెప్టెన్ ప్రస్తుతం తన భార్య, బాలివుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి చక్కర్లు కొడుతున్నాడు. ఈ సందర్భంగా మెల్ బోర్న్ పార్క్ మైదానంలో ఈ సంవత్సరలో జరుగుతున్న మొదటి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ ను తిలకించారు. అక్కడ స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజన్ పెదరర్ ను కలిసిన కోహ్లీ, అనుష్క జంట...అతడితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

అనంతరం పోడియంలో కూర్చుని సెరెనా విలియమ్స్, డయానా యాత్రెస్కా మరియు జకోవిచ్, డెనిస్ ల మధ్య జరిగిన మ్యాచ్ లను వీక్షించారు. ఈ ఫోటోలను కూడా తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన కోహ్లీ  ఓ కామెంట్‌ను జత చేశాడు. ''ఆస్ట్రేలియా ఓపెన్ వీక్షించిన ఈ రోజు ఎంత గొప్పది. ఆస్ట్రేలియా పర్యటనను ఇంత అద్భుతంగా ముగించడం చాలా బావుంది. ఈ మధుర జ్ఞాపకాలను ఎప్పటికి మరిచిపోలేను'' అని కోహ్లీ పేర్కొన్నాడు. 

ఈ సందర్భంగా కోహ్లీ భార్య అనుష్క కూడా ట్వీట్ చేసింది. చక్కటి ఎండాకాలంలో ఇలా అందమైన తన భర్తతో కలిసి టెన్నిస్ వీక్షించడం చాలా సరదానిచ్చిందని అనుష్క వెల్లడించారు. 
 
ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయాలను అందుకున్న ఆనందంలో కోహ్లీ తన భార్యతో కలిసి మరింత సరదాగా గడుపుతున్నాడు. రెండు నెలల పాటు సుధీర్ఘంగా సాగిన టీ20, టెస్ట్, వన్డే సీరిస్ లలో ఏ ఒక్కటి కూడా ఆసిస్ కు దక్కకుండా కోహ్లీ సేన జాగ్రత్త పడింది. టెస్ట్, వన్డే సీరిస్ లను గెలుచుకుని ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా భర్తతో కలిసి ఆస్ట్రేలియాలోనే వున్న బాలీవుడ్ భామ అనుష్క పలు మ్యాచుల్లో భర్తకు సపోర్టు చేస్తూ స్టేడియంలో తళుక్కున మెరిశారు. మ్యచ్ లన్ని ముగియడంతో ఈ భార్యాభర్తలిద్దరు చెట్టాపట్టాలేసుకుని సరదాగా గడుపుతున్నారు.