భారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం ఉన్న జట్టు బలమైనదని... గతంలో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ నిలకడగా విజయాలు సాధించలేకపోయారంటూ టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా దీనిపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి మండిపడ్డారు.

రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అవి అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలని సౌరవ్ అన్నాడు. చేతన్ శర్మ, నేను, ధోనీ భారత్ తరపున ఆడాం.. తరమేదైనా అన్ని తరాల వాళ్లం దేశం కోసమే ఆడాం.. అలాగే ఇప్పుడు కోహ్లీ ఆడుతున్నాడని.. ఒక తరంతో మరొక తరం క్రికెటర్లని పోల్చుతూ మాట్లాడటం పద్ధతికాదన్నాడు. తాను కూడా చాలా మాట్లాడగలనని.. కానీ అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదికాదన్నాడు.

టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత భారత జట్టు ప్రయాణం అద్భుతంగా ఉందని...నిలకడగా మంచి విజయాలు సాధిస్తోందని.. చివరి 15-20 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని విజయాలు సాధించిన జట్టుని తాను చూడలేదన్నాడు. గత జట్లోనూ గొప్ప ఆటగాళ్లున్నారు అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఆయన వ్యాఖ్యలపై మాజీ  క్రికెటర్లు మండిపడుతున్నారు.