న్యూజిలాండ్‌ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరించే ఉద్దేశంతో బరిలోకి దిగిన భారత్‌కు మొదటి వన్డే విజయం ద్వారా మంచి శుభారంభం లభించింది. ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా నేపియయర్ లో జరిగిన వన్డేలో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో రాణించి భారత్ భారీ విజయాన్ని  అందుకుంది.

ఈ మ్యాచ్ లో టీంఇండియా ఓపెనర్ 75 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పరుగులతో ధావన్ తన వన్డే కెరీర్ లో 5వేల పరుగులను పూర్తిచేసుకున్నాడు. ఈ మైలురాయిని వేంగంగా(తక్కువ మ్యాచుల్లో) సాధించిన ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానాన్ని ధావన్ ఆక్రమించాడు.  

తాను సాధించిన అరుదైన రికార్డుపై ధావన్ స్పందించాడు. తాను 5000 పరుగులను పూర్తిచేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఇలా అరుదైన రికార్డును సాధించానంటే బాగా ఆడుతున్నట్టే కదా అంటూ ధావన్ చమత్కరించాడు. 

నేపియర్ వన్డేలో కెప్టెన్ కోహ్లీతో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పడానికి తమ మధ్య వుండే సమన్వయమే కారణమన్నారు. మేమిద్దరం స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ పరుగులు సాధిస్తూ ఒత్తిడిని తగ్గించుకొడాన్ని ఇష్టపడతామన్నారు. అందుకోసం వికెట్ల మధ్య సమన్వయంతో పరుగెడుతూ జాగ్రత్త పడతామని ధావన్ తెలిపాడు. 

ఇటీవలే విజయవంతంగా పూర్తయిన ఆస్ట్రేలియా పర్యటన న్యూజిలాండ్  పర్యటనలో ఎంతో ఉపయోగపడుతోందన్నారు.. ఇరు దేశాల్లోనూ పరిస్థితులు దాదాపు ఒకే రకంగా వుంటాయన్నారు. ఇంతకు ముందుకూడా న్యూజిలాండ్ గడ్డపై ఆడటం ఈ సీరిస్‌లో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. తన బ్యాటింగ్ టెక్నిక్, ఫుట్ వర్క్ లొ ఎలాంటి మార్పులు చేయలేదని ధావన్ స్ఫష్టం చేశాడు.