CWG 2022: టీటీలో పోరాడి ఓడిన శరత్ కమల్-సతియాన్ జోడీ.. ఆకుల శ్రీజకూ నిరాశ
Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ఆదివారం ముగిసిన టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత జట్టు రజతంతోనే సరిపెట్టుకుంది.
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ - 2022 లో భాగంగా ఆదివారం ముగిసిన టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత స్టార్ ఆటగాళ్లు ఆచంట శరత్ కమల్ - జి.సతియాన్ జోడీ ఫైనల్స్ లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్ లో శరత్-సతియాన్ జోడీ.. 11-8, 8-11, 3-11, 11-7, 4-11 తేడాతో ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ పిచ్‌ఫోర్డ్-పాల్ డ్రింక్‌హాల్ చేతిలో ఓటమిపాలయ్యారు.
ఐదు సెట్ల గేమ్ లో తొలి సెట్ ను భారత జోడీ గెలుచుకుంది. కానీ ఆ తర్వాత రెండు సెట్లను ఇంగ్లాండ్ ఆటగాళ్లు నెగ్గారు. కానీ నాలుగో సెట్ లో శరత్-సతియాన్ పుంజుకుని ఆధిక్యం సాధించారు. ఇక స్వర్ణ పతక విజేతను నిర్ణయించే చివరి సెట్ లో భారత ద్వయం చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లాండ్ జోడీ 3-2 తేడాతో భారత ద్వయాన్ని ఓడించింది.
ఇక మహిళల సింగిల్స్ లో తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజ.. ఆదివారం జరిగిన కాంస్యపోరులో ఓటమిపాలైంది. కాంస్యం కోసం జరిగిన పోరులో ఆమె.. యాంగ్జీ లియూ చేతిలో ఓడింది.
ఇదిలాఉండగా.. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీస్ లో భారత ద్వయం త్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్ ల మలేషియా చేతిలో ఓడారు. కానీ వీళ్లు.. కాంస్య పోరులో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పోటీ పడనున్నారు. పురుషుల డబుల్స్ ఫైనల్స్ లోకి భారత్ ఆటగాళ్లు సాత్విక్ రాంకీ రెడ్డి - చిరాగ్ శెట్టి అడుగిడారు. ఈ ఇద్దరూ ఇంగ్లాండ్ జోడీతో తలపడనున్నారు.
ఇక ఇవాళ ఒక్కరోజే భారత్ కు నాలుగు స్వర్ణాలు రాగా అందులో మూడు బాక్సింగ్ లో వచ్చినవే కావడం విశేషం. తాజాగా టేబుల్ టెన్నిస్ లో కూడా భారత్ రజతం సాధించింది. మొత్తంగా భారత్ హాకీ, అథ్లెట్లు, బాక్సిర్ల జోరుతో నిన్నటివరకు పతకాల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్.. న్యూజిలాండ్ ను అధిగమించి నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 17 స్వర్ణాలు, 13 రజతాలు, 19 కాంస్యాలు (మొత్తం 49) ఉన్నాయి. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఉండగా.. ఆ తర్వాత ఇంగ్లాండ్, కెనడా ఉన్నాయి.