ఆసియా కప్ టోర్నీకి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ బిసిసిఐ సెలక్టర్లను తీవ్రంగా తప్పు పట్టారు.
ముంబై: ఆసియా కప్ టోర్నీకి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ బిసిసిఐ సెలక్టర్లను తీవ్రంగా తప్పు పట్టారు. కోహ్లీ ఆసియా టోర్నీ నుంచి తప్పుకునే బదులు అక్టోబర్‌లో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ నుంచి తప్పుకొని నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు విశ్రాంతి తీసుకుంటే బాగుండేదని అన్నారు.
టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకమని ఆయన అన్నాడు. మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. వచ్చే బుధవారం ఈ మహా సమరం జరగనుంది. ఒక మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా.. ఆటగాళ్లపై ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలనని అన్నాడు.
భారత్-పాక్ పోరు అంటే క్రికెట్ ప్రేమికులు ఎంతో భావోద్వేగంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు సిద్ధమవుతారని, అలాంటి మహాపోరులో కోహ్లీ అందుబాటులో లేకపోవడాన్ని ఊహించలేకపోతున్నానని అన్నాడు.
ఏ సిరీస్‌కు, ఏ టోర్నమెంట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంపై ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలక్షన్ ప్యానెల్ కసరత్తు చేయాల్సిందని సందీప్ పాటిల్ అన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్ కన్నా ఆసియా కప్‌లో విజయం సాధించడమే ముఖ్యమని చెప్పారు.
అంతగా అనుభవంలేని రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారని, అతడిపై పెద్ద భారమే ఉందని అన్నాడు. జట్టు కూర్పులో సమతూకం, మంచి టీమ్‌ను ఎంపిక చేసుకోవడం అతనికి సవాల్‌గా మారిందని అన్నారు. ప్రస్తుతం రోహిత్‌కు తగినంత సమయం లేదని, నిర్ణయాలను త్వరగా తీసుకోవాలని సందీప్ పాటిల్ అన్నాడు.
