శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య స్మగ్లింగ్ వివాదంలో చిక్కుకున్నాడంటూ ‘‘దైనిక్ భాస్కర్’’ పత్రిక ప్రచురించిన కథనం క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ పత్రిక కథనం ప్రకారం...కోట్లాది రూపాయల విలువైన ముడి వక్క పలుకులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పట్టుకున్నారు.

పన్నులు ఎగ్గొట్టడంతో పాటు వీటిని అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ కొందరిపై కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో జయసూర్యతో పాటు మరో ఇద్దరి పేర్లు ఉన్నట్లుగా తెలిపింది. విచారణలో భాగంగా రెవెన్యూ అధికారులు జయసూర్యను ముంబైకి పిలిచినట్లుగా తెలుస్తోంది.

దర్యాప్తు అనంతరం విచారణ బృందం ఓ లేఖను శ్రీలంక ప్రభుత్వానికి పంపినట్లుగా సమాచారం.. మిగిలిన ఇద్దరు క్రికెటర్లు కూడా వచ్చే నెల 2న జరిగే విచారణకు హాజరు కావాలని కోరింది. వక్క పలుకులను ఇండోనేషియా నుంచి శ్రీలంకకు తీసుకొస్తున్నారని.. అక్కడి నుంచి భారత్‌కు అక్రమ మార్గాల ద్వారా తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దక్షిణాసియా స్వేచ్ఛా వర్తక ప్రాంత చట్టాన్ని అవకాశంగా తీసుకుని భారీగా లబ్ధి పొందేందుకు శ్రీలంకలో భోగస్ కంపెనీలను స్థాపించినట్లు వెల్లడించారు. సదరు చట్టం ప్రకారం... భారత్, శ్రీలంకల మధ్య దేశీయంగా ఉత్పత్తయ్యే వివిధ రకాల ఉత్పత్తుల రెండు దేశాలకు చెందిన వర్తకదారులు పన్ను లేకుండా పంపుకోవచ్చు.

డమ్మీ కంపెనీలను స్థాపించిన కొందరు క్రికెటర్లు తమ పలుకుబడితో పాటు స్టార్‌డమ్‌ను ఉపయోగించి ప్రభుత్వం నుంచి వాణిజ్య, ఎగుమతికి చెందిన అనుమతి పొందారు. భారత్‌కు ఎగుమతయ్యే వక్క పలుకులు శ్రీలంకలోనే తయారైనట్లు పత్రాలు సైతం సృష్టించారు.

ఇండోనేషియా నుంచి వక్క పలుకులను నేరుగా దిగుమతి చేసుకుంటే 108 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ సుంకం నుంచి తప్పించుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం. దక్షిణాసియా చట్టం... నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వక్క పలుకులను ఇదే మార్గంలో దిగుమతి చేసుకుని భారీగా సంపాదించాడు.

శ్రీలంకకు చెందిన వక్క  పలుకుల వ్యాపారి... కుళ్లిన సరుకును నాగ్‌పూర్ వ్యాపారవేత్తకు అసలు ధర కంటే తక్కువగా విక్రయించేవాడు. అంటే 100 కోట్ల విలువ చేసే వక్క కేవలం 25 కోట్లకే దొరుకుతుందన్న మాట..

అనంతరం వాటిని ప్రాసెస్ చేసి నాణ్యమైన వక్కల్లో కలిపి నాగ్‌పూర్ వ్యాపారవేత్త దేశం మొత్తానికి సరఫరా చేసేవాడని ఇంటెలిజెన్స్ దర్యాప్తులో తేలింది. ఈ వక్క పలుకుల స్మగ్లింగ్‌లో ప్రస్తుతానికి జయసూర్య పేరు బయటపడగా... మిగిలిన ఇద్దరు క్రికెటర్లు ఎవరా అన్నది తెలియాల్సి ఉంది.