Asianet News TeluguAsianet News Telugu

అమీర్ హుస్సేన్ లోన్‌ పేరున్న జెర్సీ కావాలనుందంటున్న సచిన్ టెండూల్కర్.. ఇంతకీ ఎవరా క్రికెటర్ ?

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బిజ్‌బెహరాలోని వాఘమా గ్రామానికి చెందిన 34 ఏళ్ల వికలాంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్‌కి అభిమానిగా మారిపోయాడు.

Sachin Tendulkar who wants Aamir Hussain Lone's name jersey.. So who is the cricketer? - bsb
Author
First Published Jan 13, 2024, 10:01 AM IST

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బిజ్‌బెహరాలోని వాఘామా గ్రామానికి చెందిన 34 ఏళ్ల వికలాంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్‌కి అభిమానిగా మారాడు. మాస్టర్ బ్లాస్టర్ ఆ క్రికెటర్‌ని కలుసుకుని అతని పేరు ఉన్న జెర్సీని తీసుకోవాలని ఉందన్న కోరికను వ్యక్తం చేశాడు. 34 ఏళ్ల  అమీర్ హుస్సేన్ లోన్‌ ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 8 ఏళ్ల వయసులో అమీర్ హుస్సేన్ లోన్‌ ప్రమాదానికి గురయ్యాడు.

క్రికెట్ మీద విపరీతమైన ఇష్టంతో తనదైనప్రత్యేక ఆటతీరును అభివృద్ధి చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికీ అమీర్ హుస్సేన్ లోన్‌ స్ఫూర్తిగా మారాడు. అమీర్ 2013 నుండి  క్రికెట్ ఆడుతున్నాడు, అతని క్రికెట్ ప్రతిభను గుర్తించిన ఓ టీచర్ పారా క్రికెట్‌కు అమీర్ హుస్సేన్ లోన్‌ ను పరిచయం చేశాడు.

అమీర్ ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. మాజీ క్రికెటర్ సచిన్ అతని వీడియోను చూసి ఆశ్చర్యపోయాడు, భవిష్యత్తులో హుస్సేన్ లోన్‌ను కలవాలని ఉందని తెలిపాడు. మిలియన్ల మందిని ప్రేరేపించినందుకు అమీర్ హుస్సేన్ లోన్‌ ను అభినందించాడు.

IND vs ENG: శుభ‌వార్త‌.. నాలుగేళ్ల తర్వాత వైజాగ్ లో టెస్టు మ్యాచ్.. విద్యార్థుల‌కు ఫ్రీ ఎంట్రీ..

"అమీర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు. అతని ఆట నన్ను చాలా కదిలించింది. ఆట పట్ల ఎంత ప్రేమ, అంకితభావం ఉందో కనిపిస్తుంది. నేను ఒక రోజు అమీర్ హుస్సేన్ లోన్‌ ను కలుసుకుంటాను. అమీర్ పేరుతో ఉన్న జెర్సీని తీసుకుంటాను. అమీర్ లక్షలాది మందికి స్పూర్తిగా నిలిచారు" అని సచిన్ టెండూల్కర్ శుక్రవారం ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

హుస్సేన్ లోన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ఆ సమయంలో ప్రభుత్వం తనకు సహాయం చేయలేదని చెప్పాడు. అయితే, “ప్రమాదం తర్వాత, నేను ఆశ కోల్పోలేదు. కష్టపడి పనిచేశాను, ఎవ్వరిపై ఆధారపడకూడదనుకున్నాను. నా ప్రమాదం తర్వాత ఎవరూ నాకు సహాయం చేయలేదు, ప్రభుత్వం కూడా నన్ను ఆదుకోలేదు. కానీ, నా కుటుంబం ఎప్పుడూ నాకు అండగా ఉంది" అని అమీర్ అన్నారు.

34 యేళ్ల వయసున్న అమీర్.. తాను చేతులు లేకుండా ఆడటం చూసి అందరూ ఎలా ఆశ్చర్యపోయారో వివరించాడు. "మొదటిసారి నేను 2013లో ఢిల్లీలో దేశవాళీలు ఆడాను, 2018లో బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాను. ఆ తర్వాత నేపాల్, షార్జా, దుబాయ్‌లో క్రికెట్ ఆడాను. కాళ్లతో (బౌలింగ్) ఆడడం, భుజం, మెడలతో బ్యాటింగ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. క్రికెట్ ఆడేందుకు నాకు శక్తిని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు" అని జమ్మూ కాశ్మీర్‌లో జన్మించిన క్రికెటర్ తెలిపాడు.

క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ప్రతిచోటా తనకు చాలా ప్రశంసలు వస్తాయని చెప్పాడు. "ప్రతిచోటా నా ఆటకు ప్రశంసలు వస్తాయి. కాళ్ళతో బౌలింగ్ చేయడం చాలా కష్టమైన పని. అలా చేయడానికి కావాల్సిన అన్ని నైపుణ్యాలు, మెళుకువలు నేర్చుకున్నాను. నా కష్టానికి ఫలితం దక్కిందని భావిస్తున్నాను. ప్రతీ పనిని నా స్వంతంగా చేస్తాను. నేను దేవుడిపై తప్ప మరెవరిపైనా ఆధారపడను" అని క్రికెటర్ నొక్కిచెప్పాడు.

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తనకు, తన జట్టుకు ఇష్టమైన ఆటగాళ్లని అమీర్ హుస్సేన్ లోన్ అన్నాడు. దేవుడి దయ ఉంటే వారిని త్వరలోనే కలుస్తాం.. అని ముగించాడు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios