హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో భారత క్రికెట్ జట్టుకు ఆసియా కప్ లో తిప్పలు తప్పవని హైదరాబాద్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ హెచ్చరించాడు. ఆసియా కప్ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 19న భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌పైనే అందరి చూపూ ఉంది. 

చాంపియన్‌ ట్రోఫీ తర్వాత దాయాదుల పోరును అభిమానులు ఆసియాకప్‌లో చూడబోతున్నారు. రోహిత్‌ సేనకు షోయాబ్‌ మాలిక్‌ రూపంలో చిక్కులు తప్పవని లక్ష్మణ్ అన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ జట్టులో అత్యంత సీనియర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ మాలిక్‌ ఆ జట్టుకు కీలకమవుతాడని అన్నాడు. 

మిడిల్‌ ఓవర్లలో రోహిత్‌ శర్మ కచ్చితంగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయిస్తాడని, కానీ స్ట్రైక్‌ రోటేట్‌ చేయడం, స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం మాలిక్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అన్నాడు టీమిండియాతో మ్యాచ్ అంటే మాలిక్ చెలరేగి ఆడుతాడని గత రికార్డులే చెబుతున్నాయని లక్ష్మణ్ అన్నాడు. 

కుల్దీప్‌, చాహల్‌ వంటి మణికట్టు స్పిన్నర్లు ఉన్నా కూడా మాలిక్‌ కోసం ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి ఉంటుందని, ఫఖర్‌ జామన్‌, బాబర్‌ అజామ్‌ వండి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ ఉండటం పాక్‌కు బలమని అన్నాడు.