ఓ టీవి షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదరడంతో బిసిసిఐ  పాండ్యా రాహుల్ లపై చర్యలు కూడా తీసుకుంది. అయితే దుమారం రేపుతున్న పాండ్యా వ్యవహారంపై టీంఇండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత అండర్ 19 కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. 

ఈ వివాదంపై  అతిగా స్పందించి మరింత జటిలం చేయొద్దని ద్రవిడ్ అన్నారు. అంతర్జాతీయ క్రికెటర్లకు మైదానంలోనే కాదు సమాజంలో ఎలా  మసులుకోవాలో కూడా, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.  అయితే ఆటగాళ్ళ ప్రవర్తనపై నేషనల్ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో అవగాహన కార్యక్రమం ఉంటుందని...టీంఇండియా ఆటగాళ్లు బిజీ షెడ్యూల్ కారనంగా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారని ద్రవిడ్ తెలిపారు.  

ప్రస్తుతం అండర్ 19, ఇండియా ఏ జట్లకు మైదానంలోనే కాదు సమాజంలో ఎలా మసులుకోవాలో కూడా అవగాహన కల్పిస్తామన్నారు. ఇలాగే అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ద్రవిడ్ సూచించారు. అప్పుడే క్రికెటర్లు ఇలా వివాదాల్లో చిక్కుకోకుండా ఆటపైనే దృష్టి కేంద్రీకరిస్తారని ద్రవిడ్ తెలిపారు. 

గతంలో కూడా చాలామంది క్రీడాకారులు ఇలాంటి పొరపాట్లు చేశారని ద్రవిడ్ గుర్తుచేశారు. అయితే ఇలాంటి ఘటనలు జరక్కుండా  ముందుగానే జాగ్రత్తపడాలని... ఏదైనా విషయంపై ఓవర్‌గా రియాక్ట్ కావడం మంచిదికాదని ద్రవిడ్ సూచించారు. గతంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను గుర్తుంచుకుంటే ఏ ఆటగాడు మళ్లీ ఇలాంటి పొరపాట్లు చేయడని ద్రవిడ్ పేర్కొన్నారు. 

తాను కేవలం క్రికెటే కాదు సీనియర్ ఆటగాళ్ల నుండి చాలా మంచి  విషయాలను నేర్చుకున్నట్లు ద్రవిడ్ తెలిపారు. వారితో పాటు తల్లిదండ్రులు, పెద్దల నుండి సమాజంలో ఎలా మసులుకోవాలో నేర్చుకున్నానని...తన ప్రవర్తన ఎదుటివారు వేలెత్తి చూపెలా ఉండనట్లు జాగ్రత్తగా వుండేవాడినని ద్రవిడ్ వెల్లడించారు.