పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వివాదంలో ఇరుక్కున్నారు. మైదానంలో క్రీడా స్పూర్తి మరచిపోయి.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. తానొక అంతర్జాతీయ క్రికెటర్ నన్న విషయం మర్చిపోయి..  దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... పాక్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు వన్డేల సిరీస్ నడుస్తోంది. కాగా.. మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్..ఆండిల్ పెహ్లువాకియా దెబ్బకి 203 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుని కూడా ఆండిల్ పెహ్లువాకియా  తన బ్యాటింగ్ ప్రతిభతో నిలబెట్టాడు.

దీంతో.. ఆట ఓడిపోతున్నామన్న ఉక్రోశాన్ని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ తట్టుకోలేకపోయాడు. దీంతో.. ‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది? నీకు ఏం కావాలని మీ అమ్మని ప్రార్థించమన్నావు..?’’ అంటూ ఉర్దూ భాషలో జాతి వివక్ష కామెంట్స్ చేశాడు. అతను చేసిన కామెంట్స్ స్టంప్స్ మైక్ లో స్పష్టంగా రికార్డవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ విషయంలో సర్ఫరాజ్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.