కొరియన్ ఓపెన్ ఛాంపియన్ గా నిలిచిన పివీ సింధు జపాన్ క్రీడాకారిణి ఒకుహరను ఫైనల్లో మట్టికరిపించిన సింధు నజమి ఒకుహరపై 22-20, 11-21, 21-18 తేడాతో సింధు విజయం
మూడు వారాల క్రితం వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. మళ్లీ అదే ప్రత్యర్థితో జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించి కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అందరూ ఊహించినట్లే కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నజొమి ఒకుహర, తెలుగు తేజం సింధు మధ్య పోరు హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌ను సింధు గెలుచుకోగా.. రెండో గేమ్‌ను ఒకుహర సునాయాసంగా నెగ్గింది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరాగా సాగింది. భారీ ర్యాలీలు ఆడుతూ ఇద్దరు ప్లేయర్లు తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించారు. కానీ చివరికి సింధునే విజయం వరించింది.
సియోల్‌లో ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్‌లో నజమి ఒకుహరపై 22-20, 11-21, 21-18 తేడాతో సింధు విజయం సాధించింది. 1 గంటా 24 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఫైనల్‌లో సింధు పైచేయి సాధించింది. దీంతో కొరియా ఓపెన్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.
