వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కైవసం చేసుకుంది. భారతీయుల 40ఏళ్ల కళను సింధు నిజం చేసింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశాన్ని గర్వపడేలా చేసిందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. కాగా... సింధు విజయంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. సింధు విజయం సాధించడానికి కారణం ఇదే అంటూ ఓ వీడియో తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఈ ఛాంపియన్ షిప్ గెలవడానికి ముందు సింధు ఎలాంటి కసరత్తులు చేసింది, ఎంత కష్టపడింతో ఆనంద్ మహీంద్రా ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోని చూసి తాను అలిసిపోయాను అంటూ ఆయన పేర్కొనడం విశేషం.

‘‘ ఆ వీడియో చూసి నేను అలసిపోయాను. ఇది చూసిన తర్వాత సింధు ప్రపంచ విజేత ఎలా అయ్యిందని కొంచెం కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. వర్థమాన క్రీడాకారులకు సింధు ఒక లీడర్ లాంటిది.ఆమె నాయకత్వాన్ని అనుసరిస్తే... వారు కూడా అగ్రస్థానానికి చేరుకుంటారు’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కింద సింధు వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోని ఉంచారు.

ఆ వీడియో చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమౌతుంది. సింధు విజయం కోసం ఇంత కష్టపడిందా అని ఆశ్చరపోకుండా ఉండలేరు. కాగా... పతకం గెలిచిన అనంతరం మంగళవారం సింధు స్వదేశంలో అడుగుపెట్టింది. దీని కోసం తాను ఎప్పటి నుంచో కృషి చేస్తున్నానని.. ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని ఈ సందర్భంగా సింధు తెలిపింది. మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తానని హామీ ఇచ్చింది.