వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజేత పివి సింధును తెలంగాణ ముఖ్యమంత్రి కె, చంద్రశేఖర్ రావు సన్మానించారు. సింధుతో పాటు కోచ్  గోపీచంద్ ను కూడా ముఖ్యమంత్రి అభినందించారు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల కోసం సిద్దమయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్దంగా వున్నట్లు ముఖ్యమంత్రి సింధుకు హామీ ఇచ్చారు. ఇలాగే అంతర్జాతీయ  స్థాయిలో దేశ గౌరవాన్ని మరింత పెంచుతూ తెలుగు వారి ఖ్యాతిని కూడా మరింత పెంచాలని కేసిఆర్ కోరారు.  

పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో సాధించిన గోల్డ్ మెడల్ ను కేసీఆర్ కు చూపించారు. అంతేకాకుండా రెండు రాకెట్లను సిఎంకు బహూకరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడమే కాదు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేష్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... పివి సింధుపై ప్రశంసలు కురిపించారు.  ప్రపంచ చాంపియన్ షిప్ గెలవడం ద్వారా ఆమె దేశ గౌరవాన్ని నిలబెట్టారన్నారు. ఇలా 130 కోట్లమంది ప్రజల్లో తాను స్పెషల్ అని నిరూపించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విదేశీ క్రీడాకారులను ఎదిరించి ఇలాంటి ప్రతిష్టాత్మక విజయాలు సాధించడం అంత ఆషామాషీ కాదని అన్నారు. కానీ సింధు వంటి ప్రతిభ గల క్రీడాకారులు అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరన్నారు. ఇలాంటి విజయాలు పొందాలంటే కేవలం ప్రతిభ ఒక్కటే చాలదని కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరమన్నారు. సింధు కూడా ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకుందని సీఎం పేర్కొన్నారు. 

సింధును క్రీడలవైపు నడిపించిన తల్లిదండ్రులు కేసీఆర్ అభినందించారు. స్వతహాగా జాతీయ క్రీడాకారులైన రమణ దంపతులు తమ కూతురును గొప్పగా తీర్చిదిద్దారని అని అన్నారు. వారి ప్రోత్సాహం వల్లే సింధు ఈ స్థాయికి ఎదింగిందని అన్నారు.ఇక కోచ్ గోపీ చంద్ చక్కగా శిక్షణ కూడా సింధు  ఎదుగుదలో ప్రముఖ పాత్ర పోషించింది. 

''భారత్ కు అంతర్జాతీయ విజేతలను తయారుచేసిచ్చే వేదికగా హైదరాబాద్ మారుతోంది. ఇది ప్రజలందరూ ఆహ్వానించదగ్గ మంచి పరిణామం. సింధు భవిష్యత్తులో ఇంకా అనేక టోర్నమెంట్లలో పాల్గొనాలని కోరుకుంటున్నా.  ఒలింపిక్స్ కు వెళ్లి పతకంతో తిరిగిరావాలి. భవిష్యత్తు టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.