పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం.. ఐఓఏ అధ్యక్షురాలిగా ఎన్నికైన పీటీ ఉష.. 95 ఏండ్ల చరిత్రలో తొలిసారిగా..

PT USHA: పరుగుల రాణిగా దేశ ప్రజల అభిమానాన్ని చురగొన్న   పీటీ ఉష.. అరుదైన గౌరవాన్ని పొందారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

PT Usha Elected As Indian Olympic Association  President

పిలవుల్లకండి  తెక్కర పరంబిల్ ఉష (పీటీ ఉష)  అంటే ఈ తరానికి తెలుసో లేదో గానీ నైంటీస్ కిడ్స్ కు మాత్రం ఈ పేరు గురించి తెలిసే ఉంటుంది.  పరుగుల రాణిగా దేశ ప్రజల అభిమానాన్ని చురగొన్న   పీటీ ఉష.. అరుదైన గౌరవాన్ని పొందారు. దేశ ప్రజలంతా పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా పిలుచుకునే ఉష..  ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  95 ఏండ్ల  ఐఓఏ చరిత్రలో ఒక మహిళ ఈ పదవికి  ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.   జాతీయ ఒలింపిక్ సంఘం  చీఫ్ గా వ్యవహరించనున్న తొలి ఒలింపియన్ గా కూడా ఆమె రికార్డులకెక్కారు. 

ఐఓఏలో అధ్యక్ష, ఆఫీస్ బేరర్ల కోసం ఎన్నికలు (డిసెంబర్ 10న ఎలక్షన్స్) జరుగుతున్నాయి.  12 మందితో కూడిన ఆఫీస్ బేరర్ల కోసం  పలు నామినేషన్లు దాఖలైనా  అధ్యక్ష పదవికి మాత్రం ఒక్క నామినేషన్ కూడా  రాలేదు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది.  ఐఓఏ చీఫ్ గా ఆమె పేరు ఖరారైనా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

అయితే  కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాత్రం  శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ..  ‘ఐఓఏ  ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు కంగ్రాట్యులేషన్స్ గోల్డెన్ గర్ల్. అంతేగాక  ఆఫీస్ బేరర్లుగా ఎన్నిక కాబోతున్న దేశ క్రీడా హీరోలందరికీ  అభినందనలు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది..’ అని ట్వీట్ చేశారు.  

 

పీటీ ఉష ప్రస్థానం.. 

- కేరళలోని కోజికోడ్ జిల్లా కుట్టాలి గ్రామంలో జన్మించిన  (1964లో) ఉష ట్రాక్ అండ్ ఫీల్డ్ లో  సంచలనాలు నమోదు చేసింది.  
- 1976లో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఉషా కోచ్ ఓమ్ నంబియార్ ఆమెను ప్రోత్సహించారు. 
- 1980లో  పాకిస్తాన్ లోని కరాచీలో జరిగిన పాకిస్తాన్  ఓపెన్ నేషనల్ మీట్ లో ఆమె నాలుగు   గోల్డ్ మెడల్ లు సాధించింది. 
-  1982 ఆసియా గేమ్స్ లో  100 మీటర్ల, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు  నెగ్గింది. 
- 1984లో లాస్ ఏంజెల్స్ వేదికగా ముగిసిన ఒలింపిక్స్ లో తృటిలో కాంస్యాన్ని కోల్పోయింది. సెకన్లో ఐదో వంతు తేడాతో ఆమె కాంస్య పతకానికి దూరమైంది. 
- 1986 ఆసియా గేమ్స్  (జకర్తా) లో ఐదు స్వర్ణాలు, ఓ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 

రాజ్యసభకు ఎంట్రీ.. 

తన రెండున్నర దశాబ్దాల  ట్రాక్ అండ్ ఫీల్డ్ కెరీర్ లో ఎన్నో  అవార్డులు గెలుచుకున్న పీటీ ఉషా  ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు.  తమిళనాడు నుంచి ఇళయరాజా, కేరళ నుంచి పీటీ ఉషా రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే కేరళలో బలపడటానికి గాను బీజేపీ  పీటీ ఉషకు రాజ్యసభకు పంపించిందనే వాదనలూ ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios