ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నా పైరేట్స్ మరో ఓటమిని చవిచూసింది. యూపీ యోదాస్ తో జరిగిన మ్యాచ్ లో పైరేట్స్ 12 పాయింట్ల తేడాతో పరాజయం పాలయ్యింది. పైరేట్స్ స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో రాణించినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఇలా అతడి ఒంటరి పోరాటం వృధా అయ్యింది. యూపీ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో విజయం సాధ్యమయ్యింది. 

ఈ  సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతూ పైరేట్స్ జట్టు పాయింట్స్ టేబుల్ చివరన నిలిచింది. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో అయినా ఆ జట్టుకు  కలిసొస్తుందనుకుంటే అలా కూడా జరగలేదు. ఆ జట్టులోని ఆటగాళ్లు సమిష్టిగా పోరాడకుండా ఏ ఒక్కరికో ఆ బాధ్యతను అప్పగిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ప్రదీప్ నర్వాల్ ఆ  ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. 

పైరేట్స్ జట్టు రైడింగ్ లో 19, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2 ఇలా కేవలం 29 పాయింట్లు మాత్రమే సాధించింది. ఆటగాళ్లలో ప్రదీప్ నర్వాల ఒక్కడే 14 పాయింట్లతో చెలరేగగా వికాస్ 3, మను3, హదీ 3 పాయింట్లు సాధించారు. మిగతా ఆటగాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. 

మ్యాచ్ విన్నర్ యూపీ యోదాస్ విషయానికి వస్తే శ్రీకాంత్ జాదవ్ 10, సురేందర్ గిల్ 7, నితేశ్ 5, అంకుశ్  4 పాయింట్లతో ఆకట్టుకున్నారు. అలాగే అశు 3, అమిత్ 2, రిశాంక్ 2 పాయింట్లతో యూపీ గెలుపుతో తమవంతు పాత్ర పోషించారు. ఇలా యూపీ రైడింగ్ లో 20, ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్‌ట్రాల రూపంలో 1 ఇలా మొత్తం 41 పాయింట్లను అందుకుంది. మొత్తంగా 41-29 పాయింట్ల తేడాతో  యోదాస్ టీం పైరేట్స్ ని మట్టికరిపించింది.