ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 తమిళ్ తలైవాస్ మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటికు వరుస ఓటముల ద్వారా పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున నిలిచిన తలైవాస్ ను యూపీ యోదాస్ మరోసారి ఓడించింది. ఏకంగా 20 పాయింట్ల తేడాతో తలైవాస్ ను మట్టికరిపించిన యోదాస్ అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. 

రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆరంభంనుండి యూపీ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ తమిళ జట్టును ఉక్కిరిబిక్కిర చేశారు. ఇలా అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించిన యూపీ చివరకు భారీ విజయాన్ని అందుకుంది. 

యూపీ ఆటగాళ్ల సమిష్టిపోరాటమే ఆ జట్టును గెలిపించింది. శ్రీకాంత్ జాదవ్ 8, సురేందర్ గిల్ 7, సుమిత్ 5 పాయింట్లతో అదరగొట్టారు. వీరికి రిశాంక్  4, అశు 3, అమిత్ 2, గురుదీప్ 2 పాయింట్లతో చక్కటి సహకారం అందించారు. ఇలా రైడింగ్ లో 20, ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 3 మొత్తం 42 పాయింట్లు సాధించిన యూపీ విజేతగా నిలిచింది. 

తమిళ్ తలైవాస్ ఆటగాళ్లలో రాహుల్ చౌదరి 5, అజిత్ 4, రన్ సింగ్ 4, అభిషేక్ 3 పాయింట్లు సాధించారు. మిగతా ఆటగాళ్ల నుండి వారికి  మద్దతు లభించకపోవడంతో 22 పాయింట్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది.  రైడింగ్ లో 12, ట్యాకిల్స్ లో 7, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 1 పాయింట్ మాత్రమే తలైవాస్ సాధించి ఓటమిని చవిచూసింది.