ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో రెండు మరాఠీ జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో మహారాష్ట్రకు చెందిన యూ ముంబా, పుణేరీ పల్టాన్స్ జట్లు ఇవాళ(గురువారం) తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య చివరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరాటం చివరకు ఫలితం తేలకుండా టైగా ముగిసింది. రెండు జట్లూ సమానంగా 33-33 పాయింట్లు సాధించాయి. 

యూ ముంబా జట్టు రైడింగ్ లో 18, ట్యాకిల్స్ లో 11, ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా 2,  ఎక్స్‌ట్రాల రూపంలో మరో 2 ఇలా మొత్తం 33 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో అభిషేక్ 11 పాయింట్లతో ఈ మ్యాచ్ లోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే అతుల్ 4, సందీప్ 4, అర్జున్ 3, ఫజల్ 3, సురీందర్ 2, హరేంద్ర 2  పాయింట్లతో పరవాలేదనిపించారు. 

ఇక పుణేరీ పల్టాన్ విషయానికి వస్తే రైడింగ్ లో 13, ట్యాకిల్స్ లో 12, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల ద్వారా  5 పాయింట్లు సాధించింది. ఇలా ఈ జట్టు కూడా మ్యాచ్ ముగిసేసరికి 33 పాయింట్ల వద్ద నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. పూణే ఆటగాళ్లలో మంజిత్ 10, పంకజ్ 5 పాయింట్లతో ఆకట్టుకున్నారు. జాదవ్ 3, శుభమ్ 3, హది 2, నితిన్ 1 పాయింట్ సాధించారు.