ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన టైటాన్స్ కనీసం గౌరవప్రదంగా అయినా టోర్నీని ముగించేలా కనిపించడంలేదు. తాజాగా పుణేరీ పల్టాన్స్ తో తలపడ్డ టైటాన్స్ చివరి వరకు గెలుపుకోసం పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇరు జట్లు భారీ పాయింట్లతో చెలరేగినా చివరకు కేవలం 3 పాయింట్ల తేడాతో పూణే విజయాన్ని అందుకుంది.

పంచకులలోని తావు దేవిలాల్ స్పోర్ట్ కాంప్లెక్స్ ఈ ఉత్కంఠ పోరుకు వేదికయ్యింది. టైటాన్స్ ఆటగాళ్లు రాకేశ్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే ఫహాద్ 10, ఆకాశ్ 5, కృష్ణ 5, సిద్దార్థ్ 3 పాయింట్లతో రాణించినా తమ జట్టును  గెలిపించుకోలేకపోయారు. రైడింగ్ లో 32, ట్యాకిల్స్ లో 15, ఆలౌట్ల ద్వారా 2 మొత్తంగా 50 పాయింట్ల వద్దే నిలిచిపోయిన తెలుగు జట్టు ఎప్పటిలాగే మరో ఓటమిని తన ఖాతాలోకి వేసుకుంది. 

ప్రత్యర్థి పుణేరీ పల్టాన్ జట్టులో మంజిత్ 12, సుశాంత్ 11, సుర్జీత్ 7, ఇమద్ 6, నితిన్ 5, అమిత్  3 పాయింట్లతో రాణించారు. ఇలా ఆటగాళ్లందరు సమిష్టిగా పోరాడటంతో పల్టాన్ విజయం సాధించింది. రైడింగ్ లో 33, ట్యాకిల్స్ లో 15, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్‌ట్రాల ద్వారా 2 మొత్తం 53 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.