ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7 హర్యానా స్టీలర్ మరో విజయాన్ని అందుకుంది. గుజరాత్ ఫార్చూన్ సూపర్ జాయింట్స్ తో జరిగిన మ్యాచ్ హర్యానా రైడర్స్, డిఫెండర్స్ అదరగొట్టారు. దీంతో ఏకంగా 16పాయింట్ల తేడాతో గుజరాత్  చిత్తుగా ఓడిపోయింది. ఈ విజయంతో హర్యానా పాయింట్స్ పట్టికలో ముందుకు దూసుకుపోయింది. 

దేశ రాజధాని న్యూడిల్లీలోని త్యాగరాజ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ రసవత్తర పోరుకు వేదికయ్యింది. హర్యానా జట్టు ఆటగాళ్లు సమిష్టిగా రాణించి చివరకు విజయాన్ని అందుకున్నారు. ఆటగాళ్లలో వికాస్ 8, ప్రశాంత్ 8, వినయ్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నారు. మిగతావారిలో రవి కుమార్ 6, వికాస్ 3 పాయింట్లతో పరవాలేదనిపించారు. దీంతో హర్యానా జట్టు భారీ పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. 

మొత్తంగా హర్యానా రైడింగ్ లో 22, ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్‌ట్రాల రూపంలో 1 పాయింట్  సాధించింది. ఇలా మ్యాచ్ ముగిసేసరికి  41 పాయింట్లతో గుజరాత్ పై తిరుగులేని ఆధిక్యంలో నిలిచి గెలుపును సొంతం చేసుకుంది. 

ఇక గుజరాత్ విషయానికి వస్తే రైడింగ్ లో 16 పాయింట్లతో ఫరవాలేదనిపించినా ట్యాకిల్స్ లో కేవలం 8 పాయింట్స్ మాత్రమే సాధించింది. మరో పాయింట్  ఎక్స్‌ట్రా రూపంలో రావడంతో మొత్తం 25 పాయింట్లకు చేరుకుంది. అయినప్పటికి హర్యానా  కంటే ఇంకా 16 పాయింట్లు వెనుకబడి ఘోర ఓటమిని చవిచూసింది.

గుజరాత్ ఆటగాళ్లలో ఏ ఒక్కరు మెరుగ్గా రాణించి భారీ పాయింట్లు రాబట్టలేకపోయారు. అబూ ఫజల్ 4, మోరే 4, రోహిత్ 4 పాయింట్లతో ఆ జట్టులో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక  వినోద్ 3,  రుతురాజ్ 2, లలిత్ 2, సుమిత్ 2 పాయింట్లు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా 25-41 తేడాతో గుజరాత్ పై హర్యానా ఘనవిజయం సాధించింది.