సొంత మైదానం... ప్రేక్షకుల పూర్తి మద్దతు దబాండ్ డిల్లీ జట్టుకు మంచి బూస్ట్ ఇచ్చినట్లుంది. త్యాగరాయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యూ ముంబాతో జరిగిన మ్యాచ్ లో డిల్లీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగి చివరకు ఆతిథ్య జట్టు 16 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇలా పాయింట్స్ టేబుల్ లో ఇప్పటికే టాప్ లో నిలిచిన దబాంగ్ జట్టు ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

డిల్లీ ఆటగాళ్లలో నవీన్ కుమార్ 11 పాయింట్లతో ఈ మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడితో పాటు  రవిందర్ 8, జోగిందర్ 6, చంద్ర రంజిత్ 4, బలరాం 2 పాయింట్లు సాధించారు.  ఇలా ఆటగాళ్లందరు రాణించడంతో డిల్లీ  జట్టు మరో అద్భుత విజయాన్ని అందుకుంది. 

ఓవరాల్ గా డిల్లీ రైడింగ్ లో అత్యధికంగా 18 పాయింట్లు సాధించింది. ఇక ట్యాకిల్స్ లో 16, ఆలౌట్ల ద్వారా  మరో 6 మొత్తం 40 పాయింట్లతో ముంబైని చిత్తుచేసింది. 

ముంబై రైడింగ్ లో 14, ట్యాకిల్స్  లో 10 ఇలా మొత్తం 24 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఆటగాళ్లలో అర్జున్ 7, సందీప్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. అలాగే ఫజల్ 4, అతుల్ 3, అభిషేక్ 2 పాయింట్లు సాధించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.ఇలా 40-24 పాయిట్ల తేడాతో ముంబైపై  డిల్లీ విజయం సాధించింది.