హోం  గ్రౌండ్...సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో  జైపూర్ పింక్ పాంథర్స్  తృటిలో ఓటమిని చవిచూసింది.  ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో భాగంగా ఇవాళ(ఆదివారం) జైపూర్- బెంగాల్ వారియర్స్ లు తలపడ్డాయి. చివరివరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టుపై బెంగాల్ వారియర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కేవలం  ఒకే ఒక పాయింట్ వారియర్స్ ను  విజేతగా, పింక్ పాంథర్స్ ను పరాజితులుగా  నిలిపింది.

ఈ ఉంత్కంఠ పోరుకు జైపూర్ లోని సవాయ్  మాన్ సింగ్ స్టేడియం వేదికయ్యింది. వారియర్స్ ఆటగాళ్ళలో మణీందర్ సింగ్ హవా కొనసాగింది.  అతడొక్కడే  ఏకంగా 19 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర  పోషించాడు. అతడికి ప్రభంజన్ 5, బల్దేవ్ సింగ్ 3, రింకు సింగ్  3,ఇస్మాయిల్ 2, రవీంద్ర 2 పాయింట్లతో చక్కటి సహకారం అందించారు.దీంతో వారియర్స్ రైడింగ్ లో  28, ట్యాకిల్స్ లో 10,ఆలౌట్ల  ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 1 మొత్తం 41 పాయింట్లు సాధించింది.

ఇక స్థానికి పింక్  పాంథర్స్ ఆటగాళ్లలో నీలేశ్ 15, దీపక్ 10 పాయింట్లతో రాణించినా తమ జట్టును విజేతగా నిలపలేకపోయారు. రైడింగ్ లో 28, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల ద్వారా 3 మొత్తం 40 పాయింట్లు సాధించి ప్రత్యర్థికంటే కేవలం 1పాయింట్ వెనుకబడి పింక్ పాంథర్స్  ఓటమిని చవిచూసింది.