హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో యూపీ యోదా జట్టుపై బెంగాల్ వారియర్స్ ఘన విజయం సాధించింది. ఆరంభం నుండి బెంగాల్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చారు. దీంతో ఏకంగా 31 పాయింట్ల భారీ ఆధిక్యంతో బెంగాల్ ఘన విజయం సాధించింది. 


ఈ మ్యాచ్ లో బెంగాల్ జట్టు కేవలం రైడింగ్ లో సాధించినన్ని పాయింట్స్ కూడా యూపీ  మొత్తం మ్యాచ్ లో సాధించలేకపోయింది. ఇక  ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ ద్వారా 8, ఎక్స్ ట్రాలతో 1, సూపర్ రైడ్స్ తో  మరో పాయింట్  ఇలా బెంగాల్ వారియర్స్ మొత్తం 48 పాయింట్స్ తో దుమ్ములేపింది. 

ఆటగాళ్ల విషయానికి వస్తే రైడర్ ఇస్మాయిల్ 10, మనిందర్ సింగ్  9 పాయింట్స్ తో అదరగొట్టారు. మిగతావారిలో బల్దేవ్ సింగ్ 7, ప్రపంజన్ 5, రింకు 4,జీవ కుమార్ 3 పాయింట్స్ సాధించి బెంగాల్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. 

 యూపీ యోదా జట్టు పేలవ ప్రదర్శనతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. రైడింగ్ లో 10, ట్యాకిల్స్ లో 5, ఎక్స్ ట్రాల ద్వారా 2 ఇలా మొత్తం 17 పాయింట్స్ మాత్రమే యూపీ సాధించగలిగింది. ఆటగాళ్ల విషయానికి వస్తే మోనూ గోయట్ 6, సురేందర్ సింగ్ 3, అమిత్ 2, నితేష్ 2, సచిన్, సురేందర్ గిల్ లు ఒక్కో పాయింట్ సాధించారు. దీంతో ఏకంగా  17-48 తేడాతో యూపీ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.