PM Modi: ‘కామన్వెల్త్’ విజేతలతో ముచ్చటించిన మోడీ.. బాక్సింగ్ గ్లవ్స్ గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ బాక్సర్
India In CWG 2022: ఇటీవలే బర్మింగ్‌హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అంచనాలకు మించి రాణించారు. స్వదేశానికి చేరిన తర్వాత వారంతా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.
72 దేశాలు పాల్గొన్న కామన్వెల్త్ క్రీడలు - 2022 లో సత్తా చాటి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన భారత క్రీడాకారులు ఇటీవలే స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా పతకాలు గెలిచినవారితో పాటు ఈ క్రీడలలో పాల్గొన్న భారత బృందంతో శనివారం ప్రధాని మోడీ ముచ్చటించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోడీ.. కామన్వెల్త్ ఛాంపియన్లతో సమావేశమై వారితో మాట్లాడారు. మోడీ అథ్లెట్లను పేరుపేరునా పలకరిస్తూ వారిని సత్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. ప్రధాని మోడీకి తన బాక్సింగ్ గ్లవ్స్ ను బహుమతిగా అందించింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘కామన్వెల్త్ గేమ్స్ లో నేను స్వర్ణం గెలిచిన మ్యాచ్ లో పాల్గొన్న బాక్సింగ్ గ్లవ్స్ ను మోడీకి బహుమతిగా అందించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుత అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు..’ అని ట్వీట్ లో పేర్కొంది.
అసోం స్ప్రింటర్ హిమాదాస్ ఆ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ వస్త్రం గమ్చాను మోడీకి బహుమతిగా అందజేసింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ లో పంచుకుంది. వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణం గెలిచిన మీరాబాయి చాన.. వెయిట్ లిఫ్టర్లు సంతకం చేసిన జెర్సీని మోడీకి బహుమతిగా ఇచ్చింది.
ఇక ఈ కార్యక్రమంలో మోడీ.. ఒక్కొక్క అథ్లెట్ ను పలకరిస్తూ వారితో ముచ్చటించారు. కామన్వెల్త్ విషయాలు అడిగి తెలుసుకున్నారు. క్రీడలలో రాబోయే రోజుల్లో భారత్ మరిన్ని అద్భుతాలు సాధించనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ క్రీడాకారులతో కలిసి దిగిన ఫోటోలను ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు.
ఇక జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరిగిన కామన్వెల్త్ క్రీడలలో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలతో మొత్తం 61 మెడల్స్ తో నాలుగో స్థానంలో నిలిచింది. తెలుగుతేజాలు పివి సింధు, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజలు స్వర్ణ పతకాలు నెగ్గిన జాబితాలో ఉన్నారు.