జాతి వివక్ష వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్‌పై ఐసిసి నాలుగు వన్డేల నిషేదం విధించిన విషయం తెలిసిందే. అయితే అహ్మద్‌పై నిషేధం విధించడాన్ని పిసిబి తప్పుబట్టింది. ఈ వివాదంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు(పాకిస్థాన్, దక్షిణాఫ్రికా) లేని అభ్యంతరం ఐసిసికి ఏంటని పిసిబి చీఫ్ ఇషాన్ మణి ప్రశ్నించారు.

ఈ జాతి వివక్ష వ్యాఖ్యల వివాదంపై ఇషాన్ మాట్లాడుతూ...ఈ విషయంలో ఐసిసి అతిగా వ్యవహరించిందన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫెహ్లుక్వాయోకు సర్పరాజ్ క్షమాపణలు చెప్పాడు. ఇలా తప్పు చేసినట్లు ఒప్పుకుని, పశ్చాత్తాపం వ్యక్తం చేసిన అతడిపై ఐసిసి ఇంత కఠినంగా వ్యవహరించడం తగదంటూ ఇషాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు,  దక్షిణాఫ్రికా బోర్డుకు మంచి సంత్సంబంధాలున్నాయని ఇషాన్ వెల్లడించారు. అందువల్లే సర్పరాజ్ తమ ఆటగాడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినా దక్షిణాఫ్రికా బోర్డుగానీ, జట్టు గానీ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఐసిసి మాత్రం ఈ వివాదాన్ని పెద్దది చేసిందని...సర్పరాజ్ కెరీర్ ను దెబ్బతీసేలా సస్పెన్షన్ విధించడం తప్పుడు నిర్ణయంగా ఇషాన్ పేర్కొన్నాడు. 
   
ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫెహ్లుక్వాయోపై పాక్ క్రికెటర్ సర్పరాజ్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ''అబే నల్లోడా.. మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుంది? నీకోసం ఏమని ప్రార్థిస్తోంది'' అంటూ సర్పరాజ్ ఉర్దూలో కామెంట్ చేయగా...అవి స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఐసిసి సర్ఫరాజ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.