పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్‌పై భారత్ రగిలీపోతోంది. దాయాదిని అన్ని రకాలుగా దెబ్బ తీసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత్.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 200 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తాజాగా ఆ దేశ క్రికెట్‌కు షాకిచ్చింది భారత ఛానెట్ల డీ స్పోర్ట్స్. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని భారత్‌లో నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉగ్రదాడితో దేశమంతా విషాదంలో మునిగిపోయింది.

ఈ పరిస్థితుల్లో పాక్ క్రికెట్ మ్యాచ్‌లు భారత్‌లో ప్రసారం కావడం భావ్యం కాదని భావించిన డీస్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. వాస్తవానికి లీగ్ రెండో రోజే సాంకేతిక లోపంతో ప్రసారం నిలిచిపోయినప్పటికీ.. అధికారికంగా మాత్రం 5వ గేమ్ నుంచి నిలిపివేసినట్లు ఛానెల్ యాజమాన్యం తెలిపింది.

మరోవైపు పుల్వామా ఘటనకు నిరసనగా పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తొలగించింది. బ్రాబౌర్న్ స్టేడియంలో ఆల్ రౌండర్ విభాగంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫోటోను, క్రికెట్ జట్టు విభాగంగా పాకిస్తాన్ ఫోటోలను అక్కడ ఉంచారు.

ఆ జట్టులో ఇమ్రాన్ ఖాన్ కూడా ఉండటంతో ఈ ఫోటోలను అక్కడ నుంచి తొలగించారు. దేశ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ కమిటీ తెలియజేసింది.