విరాట్ కోహ్లీ...మహేంద్ర సింగ్ ధోనీ...క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేర్లు. వీరిలో ఒకరు టీంఇండియా ప్రస్తుత కెప్టెన్ అయితే మరొకరు మాజీ కెప్టెన్. అయితే ఈ మధ్య వీరిద్దరి ఆటతీరుని, కెప్టెన్సీని పోలుస్తూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కేవలం అభిమానులే కాదు మాజీలు కూడా ఉన్నారు. బ్యాటింగ్ విషయం అటుంచితే జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లీ కంటే ధోనీనే అత్యుత్తమైన వాడని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించాడు. కానీ తన ఫేవరెట్ ఆటగాడు మాత్రం కోహ్లీనే అంటూ ఇద్దరినీ నొప్పించకుండా మాట్లాడాడు. 

షాహిద్ అఫ్రిది ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న సీరిస్ పై స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడారు. ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్ మెన్ కోహ్లీని జట్టులో ఉండటంతో ఆస్ట్రేలియా సీరిస్ లో కాస్త కష్టపడినా భారత్ విజయం సాధిస్తుంది. కానీ కోహ్లీ కెప్టెన్ గా మాత్రం ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని అన్నాడు. మాజీ కెప్టెన్ ధోనీ నుండి కెప్టెన్సీకి సంబంధించిన మెలకువలు నేర్చకుంటూ కోహ్లీ అద్భుతమైన కెప్టెన్ గా మారతాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం మాత్రం భారత జట్టును నడిపించడంలో కోహ్లీ కంటే ధోనీనే బెస్ట్ అని అఫ్రిది స్ఫష్టం చేశాడు.

బ్యాటింగ్ విషయంలో మాత్రం కోహ్లీని మించినవారు లేరని....తన ఫేవరెట్ ఆటగాడు కోహ్లీనే అని అఫ్రిది వెల్లడించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే సీరిస్ టీంఇండియా వశమవడం ఖాయమని అఫ్రిది వ్యాఖ్యానించారు.