అమ్మాయిల విషయంలో సెక్సీయస్ట్‌ కామెంట్లు చేసిన హార్డిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌‌పై మహిళా లోకం మండిపడింది. దీనిపై సీరియస్ అయిన బీసీసీఐ పాలక మండలి వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఓ టీవీ షోలో క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఓ మహిళను కన్విన్స్ చేసే విషయంలో హుందాగా వ్యవహరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అప్పట్లో ద్రవిడ్ అంటే ఇండియాలో చాలా మంది అమ్మాయిలకు కలల రాకుమారుడు. అందంతో పాటు సహనంతో వికెట్లకు ఎదురొడ్డి నిలిచే ఆయన ఆటకు చాలామంది ఫిదా అయ్యేవారు. ద్రవిడ్ లాంటి భర్త కావాలని కలలు కనేవారు.

ఈ క్రమంలో ఎంటీవీ నిర్వహించే ‘‘బకరా’’ అనే కార్యక్రమంలో భాగంగా ద్రవిడ్‌ను ఓ మహిళా యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ పూర్తయ్యాక తనను పెళ్లి చేసుకోమంటూ సదరు యాంకర్ ద్రవిడ్‌పై ఒత్తడి చేసింది. దీంతో షాక్‌కు గురైన ఆయన ఆమెను బుజ్జగించి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.

అయితే అప్పటికే బయట వేచి చూస్తున్న ఓ మధ్య వయస్కుడు లోపలికి వచ్చి రాహుల్ ద్రవిడ్‌ను అడ్డుకున్నాడు. ఆ యాంకర్ ఎవరో కాదని తన కుమార్తేనని, ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరాడు. తండ్రి కూతుళ్లను పక్కన కూర్చోబెట్టి పెళ్లి ఆలోచన మానుకుని తొలుత చదువుపై దృష్టి పెట్టాలని సూచించాడు.

ఆమె ఎంతగా ఒత్తిడి తెస్తున్నా ద్రవిడ్ ఎంతో హుందాగా వ్యవహరించాడు. అప్పట్లో వైరల్ అయిన ఈ వీడియోను తాజాగా ఓ అభిమాని మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని తిలకించిన నెటిజన్లు మహిళలతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలో పాండ్యా, కేఎల్ రాహుల్‌కు చురకలంటించారు.

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘‘కాఫీ విత్ కరణ్’’ టీవీ షోలో పాల్గొన్న పాండ్యా, రాహుల్ ఇద్దరు మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యానించారు. ‘‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు.. వాళ్లను అదోటైపుగా చూస్తా.. క్లబ్‌లలో వారి ఒంపులపై కైపుగా కన్నేస్తా.. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే.. నేను ఈ రోజు.. ఆ పని చేసొచ్చా’’ అని తల్లిదండ్రులతో చెప్పేస్తానని పాండ్యా వ్యాఖ్యానించాడు.