భారత్-పాకిస్థాన్ దేశాలను కలపడం కోసం తాము పెళ్లి చేసుకోలేదని సానియా మీర్జా తెలిపారు. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని సానియా మీర్జా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇరు దేశాలను కలిపేందుకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ ఉన్నాయని.. అవి నిజం కాదని సానియా మీర్జా తెలిపారు.

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. ‘‘మేమేదో  భారత్‌-పాకిస్థాన్‌లను కలపడానికి పెళ్లి చేసుకున్నామని చాలా మంది  అపోహపడుతుంటారు. ఇది నిజం కాదు. సంవత్సరానికోసారి పాకిస్థాన్‌లోని మా అత్తగారి కుటుంబాన్ని కలవడానికే వెళతాను. వాళ్లు నాపై అపారమైన ప్రేమ కురిపిస్తారు. ఆ దేశం అంతా నన్ను వదిన అని సంభోదిస్తుంది. గౌరవంగా చూస్తారు. క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నా భర్తను అక్కడి ప్రజలు అభిమానిస్తారు. ఆ అభిమానమే నాపై ప్రేమగా మారింది. షోయబ్‌ భారత్‌ వచ్చినప్పుడూ  ఇదే జరుగుతుంది. అతడిపైనా ఇక్కడి ప్రజలు ప్రేమ చూపిస్తారు’’ అని ఆమె అన్నారు.