ప్రపంచ కప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుతో వారి స్వదేశంలో జరుగుతున్న వన్డే,టీ20 సీరిస్‌లు భారత జట్టుకు పెద్ద సవాల్ విసరనున్నట్లు టీంఇండియా మాజీ ప్లేయర్ మదన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా జట్టుతె కంటే న్యూజిలాండ్ తో జాగ్రత్తగా ఆడాలని ఆయన కోహ్లీ సేనకు సలహా ఇచ్చారు. లేదంటే ఆ జట్టు భారీ సవాళ్ళను విసరగలదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు సీనియర్లు, జూనియర్లతో సమతూకంతో ఉందన్నారు. అత్యుత్తమ బ్యాట్ మెన్స్, అంతే నాణ్యమైన బౌలర్లను కలిగిన జట్టును వారి స్వదేశంలో ఎదుర్కొవడమంటూ టీంఇండియాకు పెద్ద సవాళే. అయితే వరల్డ్ కప్ కు ముందు ఇలాంటి జట్లతో తలపడితేనే మన జట్టు సామర్థ్యం మెరుగుపడుతుందని...ఆటగాళ్లకు మంచి నైపుణ్యం లభిస్తుందని మదన్ లాల్ అభిప్రాయపడ్డారు. 

అయితే స్వదేశంలో అత్యంత బలమైన ఆస్ట్రేలియాను ఓడించడం భారత్ కు కలిసొచ్చే అంశం. ఈ ఉత్సాహాన్నే ఆటగాళ్లు న్యూజిలాండ్ లో ప్రదర్శించాలి. జట్టు సమిష్టిగా రాణిస్తే మరో చారిత్రాత్మక గెలుపు సాధించవచ్చు. కానీ ఏమాత్రం అజాగ్రత్త వహించినా న్యూజిలాండ్ జట్టు అప్రమత్తమై పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చకుంటుందని సూచించారు. ఇలాంటి కఠిన జట్టుతో ఆడేటప్పుడు మన ఆటగాళ్లు కూడా మరింత కఠినంగా వుండాలని మదన్ లాల్ పేర్కొన్నారు. 

ఈ నెల 23వ తేదీ నుండి భారత్-న్యూజిలాండ్ ల మధ్య ఐదు వన్డేల సీరిస్ ప్రారంభంకానుంది. వచ్చే నెల 6 నుండి 3 టీ20 మ్యాచ్ ల సీరిస్ ప్రారంభమవుతుంది. వన్డే ప్రపంచ కప్ కు ముందు జరిగే ఈ సిరిస్ ను గెలిచి మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని టీంఇండియా భావిస్తోంది. అయితే స్వదేశంలో జరిగే ఈ సీరిస్ ను గెలిచి ప్రపంచకప్ కు వెళ్లాలని న్యూజిలాండ్ జట్టు కూడా భావిస్తోంది. ఇలా సమతూకంతో వున్న జట్ల మధ్య జరిగే పోరు కోసం ఇరరు దేశాల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

న్యూజిల్యాండ్ పర్యటనకు కోహ్లీతో పాటే అనుష్క...అభిమానుల సెటైర్లు (వీడియో)