Nikhat Zareen: ఇందూరు టు ఇస్తాంబుల్.. మన మట్టి బంగారం నిఖత్ ప్రయాణం సాగిందిలా..

Women World Boxing Finals: టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా  ఆదివారం ముగిసిన మహిళల బాక్సింగ్  ప్రపంచ ఛాంపియన్షిప్ లో తెలంగాణ లోని నిజామాబాద్ కు చెందిన 25 ఏండ్ల యువ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్దించింది. 

Nikhat zareen clinch Gold medal in IBA World Women's Boxing Championships, Know Interesting Facts About Her

ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) ఆధ్వర్యంలో  టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా ఆదివారం ముగిసిన మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఇండియా బాక్సర్ నిఖత్ జరీన్  సరికొత్త చరిత సృష్టించింది. ఇస్తాంబుల్ లో ముగిసిన ఫైనల్స్ లో జరీన్.. 5-0 తేడాతో థాయ్లాండ్ కు చెందిన జిట్పాంగ్ ను చిత్తుచిత్తుగా ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.  ఈ పతకం గెలిచిన తొలి తెలుగు, తెలంగాణ అమ్మాయిగా నిలిచింది. ఫైనల్ పోరు ఆరంభం నుంచి  ముగిసేవరకు ప్రత్యర్థికి ఏమాత్రం కూడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా.. బలమైన పంచ్ లతో విరుచుకుపడింది. 

తెలంగాణ లోని ఇందూరు (నిజామాబాద్) కు చెందిన నిఖత్ జరీన్ ఇక్కడివరకు రావడానికి చాలా కష్టపడింది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నిఖత్.. ఇందూరు నుంచి ఇస్తాంబుల్ చేరడానికి  పుష్కర కాలం కృషి దాగి ఉంది. ఆ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. 

13 ఏండ్లకే తొలి పంచ్..

నిజామాబాద్ కు చెందిన మహ్మద్ జమీల్ అహ్మద్-పర్వీన్ సుల్తానాలకు కలిగిన నలుగురి సంతానంలో  మూడో అమ్మాయి జరీన్. జమీల్.. పొట్టకూటి కోసం గల్ఫ్ లో కొన్నాళ్లు సేల్స్ ఆఫీసర్ గా పని చేసి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. చిన్నప్పట్నుంచే బాక్సింగ్ మీద మక్కువ పెంచుకున్న జరీన్.. 13 ఏండ్లలో తన ఈడు పిల్లలంతా  వీధుల వెంబడి  ఆడుకోవడానికి వెళ్తే తాను మాత్రం చేతులకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకుంది. 

నిజామాబాద్ లోని షంసముద్దీన్ దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆరు నెలలకే  ఆమె తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. 2010 లో కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లో  గోల్డ్ మెడల్ నెగ్గింది. కొద్దిరోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో కూడా పలు టోర్నీలలో పతకాలు నెగ్గింది. తర్వాత ఆమె.. విశాఖపట్నంలోని ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు దగ్గర శిక్షణ తీసుకుంది. 2010లోనే  ఈరోడ్ (తమిళనాడు) లో జరిగిన  నేషనల్ ఛాంపియన్స్ లో ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్’ అవార్డు పొందింది. 

సాధించిన ఘనతలు.. 

- 2011 లో ఇదే టర్కీలో  ముగిసిన ఏఐబీఏ ఉమెన్స్ జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె స్వర్ణం నెగ్గింది. 
- 2014లో యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్.. 
- 2015 లో అసోంలో ముగిసిన 16వ  సీనియర్ ఉమెన్  నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో  గోల్డ్ మెడల్. 
- 2019 లో బ్యాంకాక్ లో  జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో  సిల్వర్ మెడల్ 
- 2019, 2022  స్ట్రాంజ మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలలో స్వర్ణం. 

 

ప్రభుత్వ ప్రోత్సాహం.. 

2014 లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిఖత్ ప్రతిభను గుర్తించిన  రాష్ట్ర సర్కారు..  రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు  చేతుల మీదుగా ఆమె  ఆర్థిక సాయం అందుకుంది. అయితే ఆ తర్వాత ఆమె పలు అంతర్జాతీయ టోర్నీలలో గెలిచినా ప్రభుత్వం నుంచి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. 

మేరీ కోమ్ తో గొడవ.. 

2021 టోక్యో ఒలింపిక్స్ కు ముందు ఆమె.. మేరీ కోమ్ తో ఒలింపిక్స్ లో అర్హత ప్రక్రియ సందర్భంగా ఓ  గొడవ కారణంగా నిఖత్  వివాదాలతకెక్కింది. 2018 లో భుజం గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉంది. అయితే ఇవేవీ తన కూతురు విజయానికి అడ్డంకి కాలేదని అంటాడు ఆమె తండ్రి జమీల్.. నిఖత్ కు ఓటమి అంటే అసహ్యమని..  రింగ్ లో గానీ నిజజీవితంలో గానీ ఒత్తిడిని ఎదుర్కుని ఆత్మవిశ్వాసంగా ముందడుగు వేయడం ఆమె నైజమని జమీల్ తెలిపాడు. 

టర్కీలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్షిప్  లో స్వర్ణం సాధించిన నిఖత్.. ఈ ఘనత సాధించిన ఐదో భారత బాక్సర్ కాగా తొలి తెలంగాణ బాక్సర్. అంతకుముందు భారత్ తరఫున మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ మాత్రమే  పసిడి పతకాన్ని సాధించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios