Nikhat Zareen: నిఖత్ గోల్డెన్ పంచ్.. కామన్వెల్త్ లో బెర్త్ ఖాయం.. ఇక పతకమే తరువాయి...!

Commonwealth Games: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటింది. కామన్వెల్త్ గేమ్స్ కోసం జరుగుతున్న ట్రయల్స్ లో ఆమె    తన ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించి  బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. 

Nikhat Zareen and Lovlina Borgohein confirms Berths For Commonwealth Games 2022

ఇటీవలే టర్కీలోని ఇస్తాంబుల్ లో ముగిసిన ప్రపంచ  మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్.. వచ్చే నెలలో జరుగబోయే  కామన్వెల్త్ క్రీడలలో  బెర్త్ ఖాయం చేసుకుంది.  కామన్వెల్త్ క్రీడల కోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ట్రయల్స్ లో నిఖత్ జరీన్.. 7-0తో తన ప్రత్యర్థి, హర్యానాకు చెందిన మీనాక్షిపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకుంది. 

50 కిలోల విభాగంలో పోటీ పడుతున్న నిఖత్.. కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్ లో  ఆధ్యంతం  ఆకట్టుకుంది. నిఖత్ తో పాటు  టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత  లవ్లీనా బోర్గో హెయిన్, నీతూ, జాస్మిన్ లు కూడా  కామన్వెల్త్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. 

70 కిలోల విభాగంలో బోర్గో హెయిన్.. రైల్వేస్ కు చెందిన పూజా ను ఓడించింది. ఇక 48 కిలోల విభాగంలో నీతూ, 60 కేజీల విభాగంలో జాస్మిన్ కూడా  కామన్వెల్త్ లో పాల్గొనబోయే మహిళా బాక్సర్లుగా నిలిచారు. 

 

కాగా.. శుక్రవారం 48 కేజీల విభాగంలో పోటీపడ్డ భారత వెటరన్ మేరీ కోమ్ అనూహ్యంగా గాయంతో  వైదొలిగింది. ఫలితంగా  కామన్వెల్త్ లో ఆడే అర్హత కోల్పోయిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ ట్రయల్స్ లో భాగంగా 48 కిలోల విభాగంలో హర్యానా బాక్సర్ నీతూతో పోటీ పడ్డ మేరీ కోమ్.. తొలి రౌండ్ లోనే గాయపడింది. కాలికి గాయం కావడంతో కాసేపు రింగ్ లో పోరాడిన మేరీ కోమ్.. తర్వాత నొప్పిని భరించలేకపోయింది.మేరీ కోలుకునే అవకాశం లేకపోవడంతో రిఫరీ స్టాప్స్ ది కాంటెస్ట్ (ఆర్ఎస్సీఐ)  ద్వారా నీతూను విజేతగా ప్రకటించారు. 

 

జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు యూకేలోని బర్మింగ్హోమ్ లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ గేమ్స్ కోసం భారత క్రీడాకారులు చెమటోడుస్తున్నారు. గతంలో కంటే ఈసారి భారత్ కు పతకాలు మరిన్ని పెరుగుతాయని భారత క్రీడాలోకం ఆశిస్తున్నది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios