మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 136 పరుగులకే అలౌటైంది.

ముందుగా టాస్ గెలిచిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఓపెనర్ ప్రియా పునియా తొలి ఓవర్లోనే ఔటయ్యింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జెమీయా సాయంతో స్మృతీ చెలరేగింది. 24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో టీ20లలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసింది.

విజయం దిశగా వెళుతున్న దశలో 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మంధాన ఔటైంది. ఆ సమయంలో టీమిండియా విజయానికి 51 బంతుల్లో 58 పరుగులు అవసరం. భారత్ గెలుస్తుందని అందరు భావించారు.  కానీ కివీస్ బౌలర్లు విజృంభించడంతో టీమిండియా బ్యాట్స్‌మెన్లు వరుస పెట్టి పెవిలియన్‌కు క్యూ కట్టారు.

దీంతో భారత్ 19.1 ఓవర్లలో 136 పరుగులకు అలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో తాహుహు 3 వికెట్లు, కస్పెరెక్, కేర్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లతో కివీస్ 1-0 ఆధిక్యంలోకి వచ్చింది.