చండీఘడ్: మద్యం ధరలు అధికంగా వుండటంతో కరోనా సోకకుండా ఉపయోగిస్తున్న శానిటైజర్లను తాగి చాలామంది ప్రాణాలమీదకు తెచ్చకుంటున్నారు. ఇలా  శానిటైజర్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయిన జాతీయ స్థాయి కుస్తీ క్రీడాకారుడు మృతిచెందిన విషాద సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

నాలాగడ్ లోని సైజిమరాజ్ కు చెందిన  అజయ్ ఠాకూర్ కుస్తీ క్రీడాకారుడు. గతంలో అతడు జాతీయ స్థాయిలో జరిగిన కుస్తీ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి బంగారు పతకాన్ని కూడా గెల్చుకున్నాడు. మంచి క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన అతడు స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం పొంది మూడేళ్లు పనిచేశాడు. 

అయితే ఆర్మీ ఉద్యోగాన్ని వద్దనుకుని స్వస్ధలంలోనే ఆసక్తిగల యువతకు కుస్తీ మెళకువలు నేర్పించడం ప్రారంభించాడు. కానీ ఇటీవల ఓ దొంగతనం కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ అతడు జైలుపాలయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు మద్యానికి బానిసయ్యాడు. 

లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్కపోవడంతో మత్తుకోసం శానిటైజర్ తాగడం ప్రారంభించాడు అజయ్. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురయిన అతడు ఆస్పత్రిలో చేరిన అతడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృతి చెందాడు.