న్యూఢిల్లీ: టీమిండియాలో శుభ్ మన్ కు స్థానం కల్పించడంపై బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ ఎమెస్కే క్లారిటీ ఇచ్చారు. జట్టులో చోటు దక్కించుకునే అన్ని అర్హతలు శుబ్‌మన్‌ గిల్‌కు ఉన్నాయని ఆయన చెప్పారు. అతనిలో విశేషమైన టాలెంట్‌ దాగి ఉన్నందువల్లే జాతీయ జట్టులో తొందరగా స్థానాన్ని దక్కించుకున్నాడని చెప్పారు. 

జట్టు పరిస్థితులకు తగ‍్గట్టు బ్యాటింగ్ చేసే సత్తా శుబ్‌మాన్‌ సొంతమని ఎమెస్కే అన్నారు. అటు ఓపెనర్‌గా,ఇటు మిడిల్‌ ఆర్డర్‌లో కూడా శుబ్‌మన్‌ విశేషంగా రాణించగలడని అభిప్రాయపడ్డారు.

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రెగ్యులర్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మల స్థానంలో శుబ్‌మన్‌ను పరీక్షిస్తామని కూడా చెప్పారు. అయితే శుబ్‌మాన్‌కు వరల్డ్‌కప్‌లో చోటు దక్కుతుందా, లేదా అనే విషయంపై ఇప్పుడేమీ మాట్లాడుదలుచుకోలేదని అన్నారు. 

భారత్‌ జట్టులో శుబ్‌మన్‌కు అవకాశం కల్పించే సందర్భంలో భారత యువ జట్టు కోచ్‌ రాహుల్‌ ద‍్రవిడ్‌తో చర్చించామని ఆయన చెప్పారు ద్రవిడ్‌తో శుబ్‌మాన్‌ అంతర్జాతీయ అరంగేట‍్రంపై చర్చించిన తర్వాత అతనికి చోటు కల్పించే విషయంలో ఒక స్సష్టతకు వచ్చామని వివరించారు.  

దేశవాళ్లీ మ్యాచ్‌ల్లో యువ క్రికెటర్ల ఆట ఎలా ఉందనే విషయంపై ద్రావిడ్‌తో చర్చిస్తుంటామని, అలాగే సీనియర్‌ క్రికెటర్ల ఆట తీరుపై కోచ్ రవిశాస్త్రిని అడిగి తెలుసుకుంటామని అన్నారు. 

ఇది క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ అని ఎమెస్కే అన‍్నారు. అలా వచ్చిన అవకాశాల్ని పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారిలు సద్వినియోగం చేసుకోవడం కచ్చితంగా భారత జట్టుకు శుభపరిణామని ఆయన అన్నారు.