టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ కి ఉన్న క్రేజ్ మరోసారి బయటపడింది. ఈ మధ్యకాలంలో ధోనీ ఆటతీరు సరిగాలేదని... రిటైర్మెంట్ తీసుకోవడం కరెక్ట్ అంటూ పలువురు ప్రముఖులు సూచనలు ఇచ్చారు. ధోనీ రిటైర్మెంట్ తీసుకోనున్నారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే... ఎన్ని ప్రచారాలు జరిగినా.. ధోనీ ఆట తీరు ఎలా ఉన్నా... ఆయనపై అభిమానులకు ఉన్న ప్రేమ మాత్రం మారదని మరోసారి నిరూపితమైంది.

భారత్ లో ప్రధాని మోదీ తర్వాతి స్థానం ధోనీదే అని ఓ సర్వేలో వెల్లడయ్యింది. బ్రిటన్‌కు చెందిన మార్కెటింగ్‌ పరిశోధన సంస్థ యుగోవ్‌ నిర్వహించిన సర్వేలో ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు భారత్‌లో ఎంత అభిమానం ఉందనే విషయంపై నిర్వహించిన సర్వేలో ధోని 8.58 శాతాన్ని సంపాదించాడు. అయితే ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత స్థానం ధోనిదే కావడం ఇక్కడ మరో విశేషం. నరేంద్ర మోదీ 15.66 శాతంతో టాప్‌లో ఉన్నారు.

కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 4.46 శాతాన్ని మాత్రమే సాధించారు. క్రీడాకారుల జాబితాలో ధోని తర్వాత సచిన్‌ (5.81) నిలిచాడు. రతన్‌ టాటా 8.02 శాతం, బరాక్‌ ఒబామా 7.36 శాతాన్ని కల్గి ఉన్నారు. అయితే పోర్చుగీసు ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు భారత్‌లో 2.95 శాతంలో అభిమానులు ఉండటం విశేషం. ఇటీవల ఫిఫా అత్యుత్తమ  పురుషుల అవార్డును దక్కించుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ కూడా 2.32 శాతం సాధించాడు.

 41 దేశాల్లోని 42 వేలమందిని ఆ సంస్థ సర్వేలో భాగస్వాములను చేసింది. పురుషులు, మహిళల విభాగాల్లో వేర్వేరుగా సర్వే చేసింది.  భారత మహిళల్లో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (10.36) టాప్‌లో నిలిచింది.