ఆస్ట్రేలియా జట్టుపై అడిలైడ్‌  వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోని ఆటతీరు అద్భుతమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. చివరి నిమిషంలో ఒత్తిడిని తట్టుకుని...వికెట్‌ను కాపాడుకుంటూ విన్నింగ్ షాట్ కొట్టడం అంత సులువైన విషయం కాదని అన్నారు. అందుకే ధోనికి గేమ్ ఫినిషర్ అన్న పేరు వచ్చిందని..నిజంగానే అతడు అత్యుత్తమ గేమ్ ఫినిసర్ అని మరోసారి నిరూపించుకున్నాడంటూ సచిన్ కొనియాడారు.

నిర్ణయాత్మక రెండో వన్డేలో ఇద్దరు స్పెషలిస్ట్  వికెట్ కీపర్లు ధోని, కార్తిక్ లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని సచిన్ తెలిపారు. చివర్లో వారు నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ విన్నర్లుగా నిలిచారన్నారు. వారు తమ అనుభవాన్నంత ఉపయోగించి కీలక భాగస్వామ్యం నెలకొల్పి టీంఇండియా విజయంలో ప్రముఖ పాత్ర వహించారని సచిన్ పేర్కొన్నారు. 

ఇక ధోని బ్యాటింగ్ శైలి గురించి సచిన్ మాట్లాడుతూ...అతడు బ్యాటింగ్ ఆరంభించే క్రమంలో కాస్త మెల్లగా ఆడతాడు. ఇలా డాట్ బాల్స్ ఆడుతూ బౌలర్ శైలి, పరిస్థితులు, పిచ్ ప్రభావంపై ఓ అంచనాకు వస్తాడు. ఆ తర్వాత తనదైన శైలిలో బ్యాట్ ఝలిపిస్తాడు. ధోని ఒక్కసారి గాడిలో పడితే అతన్ని అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు చాలా కష్టమవుతుందని సచిన్ వివరించారు. 

రెండో వన్డేలో ధోనికి కార్తిక్ సహకరించిన తీరు చాలా  బావుందన్నారు. మంచి షాట్లతో అలరిస్తున్న ధోని స్ట్రైక్ రొటేట్ చేస్తూ కార్తిక్ చక్కటి సహకారం అందించాడని తెలిపారు. ఇలా అడిలైడ్ లో టీంఇండియా ఆటగాళ్లందరు చక్కగా రాణించి విజయాన్ని అందుకున్నారని సచిన్ వెల్లడించారు.