మంగళ వారం రాజస్థాన్ రాజధాని  జైపూర్ లో ఐపిఎల్ 2019(ఇండియన్ ప్రీమియర్ లీగ్) కోసం జరిగిన వేలంపాట కొందరు ఆటగాళ్ళ జీవితాలనే మార్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టకుండానే కొందరు ఆటగాళ్లు వేలంలో కోట్లకు అమ్ముడుపోయారు. మరికొందరు హేమాహేమీ క్రీడాకారులు కనీస ధరకు కూడా అమ్ముడుపోలేదు. ఇలా ఫ్రాంచైజీలు ఆచి తూచి తమకు అవసరం అనుకున్న ఆటగాళ్లను మాత్రమే దక్కించుకున్నారు.

అయితే ఈ వేలంపాట కొందరు ఆటగాళ్లకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది. కొందరు ఈ బాధను తమలో తామే దాచుకుంటే...మరికొందరు దాన్ని బయటకు వెళ్లగక్కారు. అలా వేలంలో తననెవరూ కొనుగోలు చేయకపోవడంపై టీమిండియా క్రికెటర్‌ మనోజ్ తివారి తన అసంతృప్తినంతా ట్వీట్ రూపంలో బయటపెట్టాడు. తన ట్రోపీలతో కూడిన పోటోలను, తాసు సాధించిన రికార్డుల గురించి పేర్కొంటూ ఓ ట్వీట్ తివారి ట్వీట్ చేశాడు. 

''తనకు ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు...తాను సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మ్యాచ్ తర్వాత కూడా టీంఇండియాలో స్థానం కోల్పోయాను. దాదాపు 14 మ్యాచుల నుండి తప్పించారు. అలాగే 2017 లో కూడా నేను ఎన్ని అవార్డులు సాధించానో చూడండి. అయినా నన్ను ఏ ఫ్రాంచైజీ ఎందుకు కొనలేదో అర్థం కావడం లేదు. అసలు నేనేం తప్పు చేశానో కూడా నాకు అర్థం కావడం లేదు'' అంటూ తివారి ట్వీట్ చేశాడు. 
 
తివారి ఇలా తన ఆవేదననంతా వెల్లడిస్తూ రాసిన ట్వీట్ నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వెలువడుతోంది. కొందరు తివారికి మద్దుతుగా నిలిస్తే మరికొందరు ప్రతిభను బట్టే ప్రాంచైజీలు ఆటగాళ్ళను ఎంపిక చేసుకున్నారంటూ జవాబిస్తున్నారు.