మెస్సీయా మజాకా! ఒక్క మ్యాచ్ చూసేందుకు రూ.90 లక్షలు! కోటి రూపాయలకు చేరిన సింగిల్ టికెట్ ప్రైజ్...
ఇంటర్ మియామీ క్లబ్ తరుపున మ్యాచులు ఆడనున్న లియోనెల్ మెస్సీ... మొదటి మ్యాచ్‌కి రూ.23 లక్షలు, రెండో మ్యాచ్‌కి రూ.90 లక్షలు పలుకుతున్న టికెట్ ధరలు..
ఇండియాలో క్రికెట్‌కి క్రేజ్ ఎక్కువ. అయితే యూరప్ దేశాల్లో ఫుట్‌బాల్‌కి ఉండే క్రేజ్ ముందు ఇది జుజుబీ. ఐపీఎల్‌లో క్రికెటర్ల కోసం ఫ్రాంఛైజీలు రూ.15-18 కోట్లు చెల్లించడానికి ముందుకు వస్తుంటేనే, క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోతూ నోరెళ్లబెడుతోంది. ఫుట్‌బాల్‌లో స్టార్ ప్లేయర్ల కోసం వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటాయి ఫుట్‌బాల్ క్లబ్స్..
ఫిఫా వరల్డ్ కప్ 2022 గెలిచిన అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, గత మూడేళ్లలో మూడు ఫుట్‌బాల్ క్లబ్స్ మారాడు. బార్సిలోనా క్లబ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు లియోనెల్ మెస్సీ. ఆ కాంట్రాక్ట్ ముగియడంతో ఇంటర్ మియామీ క్లబ్ తరుపున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు..
క్రిస్టియానో రొనాల్డో అల్ నసర్ క్లబ్ తరుపున ఆడగా, ఈ మ్యాచ్ ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ని ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు మందికిపైగా వీక్షించారు. ఈ రికార్డును లియోనెల్ మెస్సీ బ్రేక్ చేయబోతున్నాడు. 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని 1.12 బిలియన్ల మంది వీక్షించారు. ఓ అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని ఇంత మంది వీక్షించడం ఇదే మొదటిసారి..
ఎమ్‌ఎల్‌ఎస్ క్లబ్‌లో లియెనెల్ మెస్సీ ఆరంగ్రేటం చేయబోతున్న మ్యాచ్‌కి 3.5 బిలియన్ల వ్యూస్ వస్తాయని అంచనా. ఇంటర్ మియామీ టీమ్‌కి పెద్దగా పాపులారిటీ, క్రేజ్ కూడా లేదు. అయితే లియోనెల్ మెస్సీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ క్లబ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ 600 రెట్లు పెరిగింది...
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటర్ మియామీ క్లబ్‌కి 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. క్రిస్టియానో రొనాల్డో ఆడే అల్ నజర్‌కి 15.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. త్వరలోనే సోషల్ మీడియాలో ఇంటర్ మియామీ క్లబ్ ఫాలోవర్లు పెరుగుతున్న వేగం చూస్తుంటే, అది త్వరలోనే అల్ నజర్‌ని దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది..
ఇంటర్ మియామీ క్లబ్ తరుపున లియోనెల్ మెస్సీ ఆడే మ్యాచులు స్టేడియంలో చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. మొదటి మ్యాచ్ చూసేందుకు అతి తక్కువ టికెట్ ధర రూ.39,953 (భారతీయ కరెన్సీలో) ఉంటే, అత్యధికంగా 23 లక్షల రూపాయలకు పైనే ఉంది. రెండో మ్యాచ్ చూసేందుకు కనీస టికెట్ ధర రూ.12,141 ఉంటే, అత్యధికంగా రూ.90 లక్షలు పలుకుతోంది..
అంటే ఒక్క మ్యాచ్ చూసేందుకు దాదాపు భారతీయ కరెన్సీలో కోటి రూపాయల దాకా ఖర్చు చేయబోతున్నారు ఫుట్‌బాల్ ఫ్యాన్స్. ఇంటర్ మియామీ క్లబ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లియోనెల్ మెస్సీ ఏకంగా 40 మిలియన్ల యూరోలు (దాదాపు 3600 కోట్లకు పైగా) పారితోషకంగా అందుకుంటున్నాడు...