ఆసీస్ మహిళా క్రికెట్ కెప్టెన్ మెగ్ లానింగ్ మరో రికార్డు తన సొంతం చేసుకుంది. వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో మెగ్ లానింగ్ సెంచరీ సాధించి ఆసీస్ భారీ విజయంలో పాలు పంచుకున్నారు. విండీస్ పై చెలరేగిపోయిన మెగ్ లానింగ్ 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులు సాధించారు. ఇది ఆమె 13వ సెంచరీ కావడం గమనార్హం.

వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా 13వ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా మెగ్‌ లానింగ్‌ రికార్డు సృష్టించారు. మెగ్‌ లానింగ్‌ 76 ఇన్నింగ్స్‌ల్లోనే 13వ వన్డే సెంచరీ చేసీ రికార్డు సృష్టించారు. గతంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా 83 ఇన్నింగ్స్‌లో 13వ సెంచరీ మార్కును చేరి ఆ రికార్డును తన పేరిట లిఖించుకోగా, దాన్ని మెగ్‌ లానింగ్‌ బ్రేక్‌ చేశారు.  

మహిళల టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా లానింగ్‌ పేరిటే ఉంది. ఈ జూలైలో  ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో లానింగ్‌ 133 పరుగులు చేశారు. దాంతో తన పాత రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నారు.