భారత లెప్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ న్యజిలాండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ ద్వారా అరుదైన ఘనత సాధించాడు. మూడు టీ20  మ్యాచుల సీరిస్ లో కేవలం ఒకే మ్యాచ్ ఆడిన కుల్దీప్ అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.. దీంతో టీ20 క్రికెట్ విభాగంలో భారత్ తరపున అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. తాజాగా ఐసిసి ప్రకటించిన అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాకింగ్స్ లో రెండో స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. టీ20 సీరిస్ ను భారత్ 2-1 తో కోల్పోయినా...  కుల్దీప్ యాదవ్ మాత్రం తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించి వ్యక్తిగత ప్రదర్శన విషయంలో గెలుపు సాధించాడు. 

తాజాగా ఐసిసి ప్రకటించిన టీ20 బౌలర్ల జాబితాలో అప్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 793 పాయింట్లతో టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత కుల్దీప్ యాదవ్ 728 పాయింట్లతో  రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరపున కుల్దీప్ ఒక్కడే టాప్ టెన్ లో స్ధానం సంపాదించాడు. అతడి  తర్వాత ఏకంగా 17వ ర్యాంకులో మరో భారతీయ బౌలర్ యజువేంద్ర చాహల్ నిలిచాడు. భువనేశ్వర్ 18వ ర్యాంకుకు పరిమితమయ్యాడు.  

న్యూజిలాండ్ తో జరిగిన మూడు టీ20ల సీరిస్‌లో కుల్దీప్‌కు కేవలం నిర్ణయాత్మక మూడో టీ20లో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న అతడు కివీస్ ఓపెనర్లు టిమ్ సిఫర్ట్, కొలిన్ మన్రోలను వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో కుల్దీప్ ఖాతాలోకి మరిన్ని పాయింట్లు చేరి ఐసిసి ర్యాకింగ్స్ లో రెండో స్థానాన్ని ఆక్రమించాడు.  

ఇక రెండో టీ20లో తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్న కృనాల్ పాండ్య ఏకంగా 39 స్థానాలు ఎగబాకి 58వ ర్యాంకు సాధించాడు. టీ20 బౌలర్ గా కృనాల్ కు ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. 

బ్యాట్ మెన్స్ విషయానికి వస్తే డాషింగ్ ఓపెనర్లు రోహిత్ శర్మ ఒక్కడే టాప్ టెన్ లో కొనసాగుతున్నాడు. రోహిత్ 7వ ర్యాంకులో నిలవగా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 11ర్యాంకు సాధించాడు. విరాట్ కోహ్లీ 19ర్యాంకులో నిలిచాడు. మొత్తంగా టీ20 జట్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే మన దాయాది పాకిస్థాన్ మొదటి ర్యాంకులో కొనసాగుతుండగా టీంఇండియా రెండో స్థానానికి పరిమితమయ్యింది.