న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించి వన్డే సీరిస్ ను కైవసం చేసుకున్న భారత్ టీ20 సీరిస్ ను మాత్రం పేలవంగా ఆరంభించింది. మొదటి టీ20లో టీంఇండియా ఏకంగా 80 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. భారత ఆటగాళ్లు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ ఘోరంగా విఫలమవడంతో ఓటమి తప్పలేదు. తాజాగా ఈ  ఓటమిపై భారత ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా స్పందించాడు. ఈ ఓటమికి తమ జట్టు సమిష్టిగా విఫలమవడంతో పాటు కివీస్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడం కూడా కారణమని పాండ్యా పేర్కొన్నాడు.  

వెల్లింగ్టన్ లో జరిగిన మొదటి టీ20లో మొదట కివీస్ బ్యాట్ మెన్స్ రాణించడంతో భారీ స్కోరు సాధించిందని గుర్తుచేశారు. వారిని అడ్డుకోవడంలో భారత బౌలర్లందరు  విఫలమయ్యారని అన్నాడు. స్కోరు బోర్డుపై 119 పరుగుల భారీ స్కోరు చూడగానే తమపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఈ క్రమంలో 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఒత్తిడి కారణంగా భారత బ్యాట్ మెన్స్ కూడా విఫలమయ్యారని పాండ్యా తెలిపాడు. 

ఈ ఓటమికి తమ వైఫల్యం ఎంత కారణమో న్యూజిలాండ్ ఆటగాళ్ల అత్యుత్తమ ఆటతీరు కూడా అంతే కారణమని పాండ్యా పేర్కొన్నాడు. కివీస్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యత్తమంగా రాణించారన్నాడు. తమ బౌలర్లు వేసిన కొన్ని చెత్త బంతులు కూడా కివీస్ భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాయని తెలిపాడు. మిగతా రెండు టీట్వంటీ మ్యాచుల్లో ఆ తప్పులు జరక్కుండా చూసుకుని గెలుపుకోసం పోరాడతామని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు.